రోడ్డుప్ర‌మాదంలో మ‌హిళా సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి

22-yr-old techie mowed down by truck while trying to avoid pothole in Chennai. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నుంచి పడిపోవడంతో 22 ఏళ్ల మ‌హిళా

By Medi Samrat  Published on  4 Jan 2023 10:59 AM IST
రోడ్డుప్ర‌మాదంలో మ‌హిళా సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ మృతి

రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనంపై నుంచి పడిపోవడంతో 22 ఏళ్ల మ‌హిళా సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను ట్రక్కు ఢీకొట్టింది. చెన్నైలోని మధురవాయల్ సమీపంలో ఈ ఘటన జరగ్గా.. ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శోభన అనే బాధితురాలు జోహో అనే ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

నీట్‌ కోచింగ్‌ క్లాస్ నిమిత్తం మంగళవారం తన సోదరుడిని ఇన్స్‌స్టిట్యూట్ వ‌ద్ద‌ దింపేందుకు యువ‌తి వెళ్లింది. గుంతలతో ఉన్న‌ మధురవాయల్‌లో రహదారిపై వెళ్తుండ‌గా అదుపుత‌ప్పి ఇద్ద‌రూ ద్విచక్ర వాహనంపై నుండి పడిపోయారు. వీరి వెనకే వ‌స్తున్న‌ లారీ భైక్‌ను ఢీకొట్టడంతో శోభ‌న అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు తృటిలో ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నాడు.

పూనమల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోభన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం పోరూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి పరారైన‌ ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టర్‌లో శోభన మరణంపై స‌ప్పందించారు. "మా ఇంజనీర్‌లలో ఒకరైన శోభన చెన్నైలోని మధురవాయల్ సమీపంలో గుంతలు పడిన రోడ్లపై స్కూటర్ స్కిడ్ కావడంతో మరణించింది. ఆమె తన తమ్ముడిని పాఠశాలకు తీసుకువెళుతోంది. అధ్వాన్నమైన రోడ్లు జోహోకు, ఆమె కుటుంబానికి విషాదాన్ని మిగిల్చాయి" అని ట్వీట్ చేశారు.


Next Story