ప్రత్యేక విమానంలో 112 మంది చైనా నుంచి ఢిల్లీకి..

By సుభాష్  Published on  27 Feb 2020 11:50 AM GMT
ప్రత్యేక విమానంలో 112 మంది చైనా నుంచి ఢిల్లీకి..

కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2770కు చేరగా, 81,212 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్‌ ఇతర దేశాలన్నింటికి వ్యాపించింది. ఈ కరోనా చైనాతో పాటు 48 దేశాలకు విస్తరించింది. కాగా, చైనాలోని వుహాన్‌ నుంచి గురువారం 112 మందిని ఎయిర్‌ఫోర్స్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. వీరిలో 76 మంది భారతీయులుండగా, 36 మంది విదేశీయులున్నారు. సీ -17 విమానంలో భారత్‌ నుంచి 15 టన్నుల మేర మాస్కులు, ఇతర వైద్య పరికరాలను చైనాకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో చైనాలో చిక్కుకున్న వారిని విమానంలో తీసుకొచ్చారు. కాగా, విమానంలో తీసుకొచ్చిన వారిలో ఇద్దరు తెలుగువారున్నట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన జ్యోతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయి ఉన్నట్లు సమాచారం. వీరిని ఢిల్లీ సమీపంలో ఉన్న చావ్లాలోని ఐటీబీపీ సెంటర్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వీరిని 14 రోజుల పాటు ఉంచి వైద్య పరీక్షలు చేయనున్నారు.

36 మంది విదేశీయులు

ప్రత్యేక విమానంలో చైనా నుంచి తీసుకువచ్చిన వారిలో 36 మంది విదేశీయులున్నట్లు తెలుస్తోంది. చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, దక్షిణాఫ్రికా, అమెరికా తదితర దేశాలకు చెందిన వారున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎయిర్‌ ఇండియా విమానంలో 600 మంది భారతీయులు, బంగ్లాదేశ్‌, మాల్దీవులకు చెందిన వారిని భారత్‌కు తీసుకొచ్చారు. కరోనా వైరస్ కారణంగా భారత అధికారులు చైనా ప్రభుత్వంతో చర్చలు జరపడంతో వారిని వెనక్కి పంపించేందుకు అంగీకరించింది.

Next Story