ఎట్టకేలకు ఇండియాకొస్తున్న జ్యోతి..

By రాణి  Published on  27 Feb 2020 11:11 AM GMT
ఎట్టకేలకు ఇండియాకొస్తున్న జ్యోతి..

మార్చి 15వ తేదీన కర్నూల్ జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి(22)కి అమర్ నాథ్ అనే వ్యక్తితో పెళ్లి చేసేందుకు పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. వీరికి నిశ్చితార్థం జరిగి కూడా ఆరునెలలకు పైనే అవుతోంది. కానీ ఆమె మాత్రం ఇంకా సొంత ఊరికి చేరుకోలేదు. ఇదంతా కరోనా ప్రభావమే.

చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన తెలుగు టెకీలిద్దరు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ దేశానికి చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ ప్లే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏపీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ లో 58 మంది ట్రైనీ ఇంజినీర్లుగా సెలెక్టయ్యారు. అందరికీ వుహాన్ లో శిక్షణ ఇవ్వాలని చెప్పడంతో..వారంతా చైనాకు పయనమయ్యారు. అలా వెళ్లారో లేదో..ఇంతలోనే భయంకరమైన కరోనా వైరస్ మృత్యు ప్రళయం సృష్టించింది. దీంతో వుహాన్ నగరాన్ని అష్ట దిగ్భంధం చేశారు. అక్కడున్న తెలుగు వారిని తిరిగి వెనక్కు పంపాలని భారత్ దౌత్య కార్యాలయం చైనాకు విన్నవించగా..అందరినీ పంపించేశారు. ఇద్దర్ని తప్ప. వారిద్దరిలో జ్యోతి కూడా ఉంది. మరో ట్రైనీ ఇంజినీర్ సత్యసాయి కృష్ణ.

నెల రోజుల క్రితం..ఇంటికి పంపిస్తున్నామని చెప్పగానే జ్యోతి ఆనందానికి అవధుల్లేవు. అన్ని సర్దేసుకుని ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. కానీ..అక్కడ చేసిన స్ర్కీనింగ్ టెస్ట్ లో ఆమె శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడే ఆపేశారు. దీంతో జ్యోతి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇంటికెళ్లి ఎంచక్కా పెళ్లి చేసుకుని..కొత్త ఉద్యోగంలో స్థిరపడదామనుకున్న జ్యోతికి గట్టి షాకిచ్చింది కరోనా వైరస్. 27 రోజులుగా ఆమె తల్లి జ్యోతిని తిరిగి వెనక్కి పంపాలని అధికారులను వేడుకోగా..స్పందించిన అధికారులు ఆమెను తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. 48 గంటల్లో ఆమె ఇండియాకు చేరుకుంటుందని ఇండియా ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ఇండియాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జ్యోతికి ఇండియా ఎంబసీ మెసేజ్ పంపింది. జ్యోతి తండ్రి మహేశ్వరరెడ్డి ఇండియన్ ఆర్మీలో సైన్యాధికారిగా పనిచేసి 2014లో తనువు చాలించారు.

జ్యోతికి కాబోయే భర్త..అమర్ నాథ్ రెడ్డి కూడా అధికారులకు జ్యోతిని తిరిగి వెనక్కి పంపాల్సిందిగా వేడుకున్నాడు. జ్యోతిని అక్కడకు తీసుకెళ్లి సంస్థ యాజమాన్యం గానీ..అక్కడున్న అధికారులు గానీ తెలుగు టెకీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. మామూలుగా ఆరోగ్య సమస్యలొచ్చినా సరైన మందులు అందుబాటులో లేవని..అందునా వారుండే డార్మెటరీలో కేవలం నాన్ వెజ్ మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. జ్యోతి వెజిటేరియన్ కావడంతో పచ్చడి, అన్నంతోనే కడుపు నింపుకుంటోందని..దీని వల్ల ఆమె చాలా బలహీన పడిందని పేర్కొన్నాడు. మార్చి 15 లోపు జ్యోతి ఇండియాకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో..తమ పెళ్లిని వాయిదా వేసినట్లు తెలిపారు.

Next Story