ఇప్పుడు ముమ్ముమ్ముమ్ముమ్ము ముద్దంటే చేదే!!

By రాణి  Published on  27 Feb 2020 11:30 AM GMT
ఇప్పుడు ముమ్ముమ్ముమ్ముమ్ము ముద్దంటే చేదే!!

ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా? అని ఎవరైనా అనడిగితే ఇప్పుడు ఇటలీ, ఇంగ్లండ్ సహా యూరప్ అంతా ఒకే మాట అంటోంది..“లేదు..లేదు..చచ్చినా ఆ ఉద్దేశం లేదు.” అంటున్నారు. అదేమిటని అడిగితే “చావాలని లేదు. అందుకే ముద్దు వద్దు బాబూ వద్దు” అంటున్నారు ఆ దేశాల వారు. ఎందుకంటే ముద్దుల ద్వారా, చేతులు కలపడం ద్వారా, పెక్ లు ఇచ్చుకోవడం ద్వారా కరోనా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అన్నిటికన్నా ముఖ్యం స్పర్శను తగ్గించాలని నిపుణులు అంటున్నారు. “హాయ్ బ్రో” అంటూ, “హలో స్వీటీ” అంటూ ముట్టుకుంటే కరోనా పట్టుకుంటుందని వారు చెబుతున్నారు.

అప్పుడెప్పుడో 1439 లో ప్లేగు వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముద్దులు పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. కరోనా రెండు నెలలలోనే పాతిక దేశాలను తన గుప్పెట్లోకి తెచ్చేసుకుంది. 2700 మంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అసలు ఇతరులతో స్పర్శను తగ్గించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఇక రొమాన్సుకు మారుపేరైన ఇటలీలో ప్రజలు ముద్దులు పెట్టుకోవడానికి సందేహిస్తున్నారు. పాపం ముద్దులు పెట్టుకోవడం బాగా అలవాటైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ అలవాటును మానుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. “ఘాటు ముద్దు హెల్తుకి చేటు” అని సర్ది చెప్పుకుంటున్నారు. ఇక బ్రిటన్ లో అయితే వాలెంటైన్స్ డే నాడు కూడా ముద్దులు వద్దే వద్దనుకున్నారట. సింగపూర్, రష్యా, ఇండియా, ఇరాన్ లు కూడా ముద్దు నిషేధాన్ని విధించాయి. జపాన్ వంటి దేశాల్లో మామూలుగానే తల వంచి నమస్కారం చేస్తూంటారు. అక్కడ ముట్టకోవడాల వంటివి పబ్లిక్ గా జరగవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తన తాజా గైడ్ లైన్స్ లో ముట్టుకోవడాలు, పట్టుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు వద్దని సలహా ఇస్తుంది.

వ్యాధి నిపుణులు చెప్పేదేమిటంటే మిగతా వైరస్ ల లాగా కాకుండా ఇది మలం ద్వారా కూడా వ్యాపిస్తుంది. సార్స్, జికా వంటి వ్యాధుల లాగా కాకుండా కరోనా వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలేవీ కనిపించవు. దీంతో గుర్తింపు మరింత కఠినతరం అవుతోంది. అందుకే మమ్ముమ్ముమ్ముద్దంటే చేదు అనుకోవడమే మంచిది.

Next Story