నిందలు పడ్డ ఆ నలుగురే.. ఇప్పుడు నష్టాల్లో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2020 11:35 AM ISTటాలీవుడ్లో తరచుగా ‘ఆ నలుగురు’ అంటూ ఓ మాట వినిపిస్తూ ఉంటుంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకనపుడు.. వాటి నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి నలుగురు సినీ పెద్దలు థియేటర్లన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. తమ సినిమాలు, తమకు నచ్చిన వాళ్ల సినిమాలకే థియేటర్లు కేటాయిస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్నారని ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుంటారు.
కచ్చితంగా ఆ నలుగురు ఎవ్వరు అని చెప్పలేం కానీ.. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ లాంటి వాళ్లు ఈ విషయంలో టార్గెట్ అవుతుంటారు. ఒకప్పుడు ఏ థియేటర్‌కు ఆ థియేటర్ వాటి యజమానుల చేతుల్లో ఉండేది. కానీ వీటిని మెయింటైన్ చేస్తూ ఆదాయంలో హెచ్చుతగ్గులతో సర్దుబాటు చేసుకోవడం కన్నా.. లీజుకు ఇచ్చేస్తే బెటర్ అనే ఆలోచన యజమానులకు వచ్చింది.
దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్లు కూడా సింగిల్ స్క్రీన్లను ఇలా పెద్ద ఎత్తున లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. ఐతే ఎప్పుడూ నిందలు పడే దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వాళ్లు.. అప్పుడప్పడూ థియేటర్లు మెయింటైన్ చేయడంలో ఉన్న ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. రోజు రోజుకూ జూదంలా మారిపోతున్న థియేటర్ బిజినెస్‌తో తామెంత ఇబ్బంది పడుతున్నది గతంలో కొన్ని సందర్భాల్లో వివరించారు వీళ్లిద్దరూ.
ఐతే ఇంతకుముందు కొన్నిసార్లు లాభాలుంటే.. కొన్నిసార్లు నష్టాలొచ్చాయి. కానీ గత ఐదు నెలల్లో థియేటర్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి తర్వాత థియేటర్లు వెలవెలబోతూనే ఉన్నాయి. ఫిబ్రవరి సినిమాల నుంచి వచ్చిన ఆదాయం మెయింటైనెన్స్‌కే సరిపోయింది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ.
కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడిపోయాయి. పైసా ఆదాయం లేదు. పైగా థియేటర్లను మెయింటైన్ చేయాలి. వాటిని నమ్ముకున్న సిబ్బందికి ఎంతో కొంత సాయం చేయాలి. అలాగే లీజు లేదా అద్దె డబ్బులూ చెల్లించాలి. ఆదాయం రాకపోగా.. చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్సుల వరకు అన్నిటి పరిస్థితి ఇంతే. ఈ ఇండస్ట్రీ కరోనా ధాటికి దారుణాతి దారుణంగా దెబ్బ తింది. మిగతా వ్యాపారాలు అంతో ఇంతో నడుస్తున్నాయి. పుంజుకునే ప్రయత్నంలో ఉన్నాయి. థియేటర్లను నమ్ముకున్న వాళ్లు మాత్రం నిండా మునిగిపోయారు. థియేటర్లు గుప్పెట్లో ఉంచుకున్నారని ఎప్పుడూ నిందలు పడే ఆ నలుగురు ఇప్పుడు అవే తలకుమించిన భారంలా మారి కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు.