తెలంగాణలో కరోనా.. పెద్ద డేంజర్లోనే ఉన్నామా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jun 2020 12:01 PM ISTరెండు నెలల కిందట తెలంగాణలో కరోనా కేసులు సింగిల్ డిజిట్లో ఉండగా జనాలు భయంతో వణికిపోయారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. కేసులు వందల్లో మరణాలు పదుల్లో నమోదయ్యే పరిస్థితి వచ్చేసింది. కానీ ఇప్పుడు జనాలు కరోనా అంటే భయమే లేనట్లు వ్యవహరిస్తున్నారు. మామూలు జీవనం సాగిస్తున్నారు. అన్ని చోట్లకూ తిరిగేస్తున్నారు. పెద్దగా నియంత్రణలేమీ పాటించట్లేదు.
హైదరాబాద్ రామ్ నగర్‌లోని చేపల మార్కెట్లో ఆదివారం నాటి దృశ్యాలు చూస్తే.. షాకవ్వాల్సిందే. వందల మంది ఒకే చోట గుమికూడి చేపల కొనుగోలులో మునిగిపోయారు. చాలామందికి మాస్కుల్లేవు. భౌతిక దూరం అసలే లేదు. ఐతే రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల లెక్కలు తీస్తే అర్థమవుతోంది.
రోజూ వందకు తక్కువ కాకుండా కేసులు బయటపడుతున్నాయి. అది కూడా చాలా తక్కువ టెస్టులు చేస్తుండగా.. కేసుల సంఖ్య ఇలా ఉంది. మిగతా రాష్ట్రాల్లో మాదిరి వేలల్లో పరీక్షలు చేస్తే.. రాండమ్ టెస్టులు నిర్వహిస్తే ఇంకెన్ని కేసులు నమోదవుతాయో. తెలంగాణలో మార్చి 28న తొలి కరోనా మరణం నమోదైంది. జూన్ 4న 100వ వ్యక్తి చనిపోయారు. ఐతే జూన్ 4 నుంచి 8వ తేదీ లోపు నాలుగు రోజుల వ్యవధిలో 38 మంది కరోనాతో చనిపోవడం గమనార్హం.
రోజూ మరణాల సంఖ్య డబుల్ డిజిట్‌ను రీచ్ అవుతోంది. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిన్న చనిపోయిన ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్టు మనోజ్ కుమార్.. గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకే ప్రాణాలు వదలాల్సి వచ్చిందని స్పష్టమవుతోంది. మీడియా కూడా కరోనా మరణాల్ని మామూలుగా చూపించే స్థాయికి వచ్చేసింది. కాబట్టి ఎవరి ప్రాణాల పట్ల వాళ్లకే జాగ్రత్త ఉండాలి. కరోనా పట్ల భయం చాలా అవసరం. అన్నది స్పష్టం.
.