ఆ తప్పు చేయని జగన్.. ఏపీకి ఎంత మేలు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Jun 2020 12:22 PM GMTతప్పు చేస్తే ఫలితం అనుభవించక తప్పుదు. సగటుజీవి చేసే తప్పునకు ఫలితం ఒకలా ఉంటే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు చేసే తప్పులకు మూల్యం భారీగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచాన్ని భయపెట్టేస్తున్న మహమ్మారికి మందు లేకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే.. దాని బారి నుంచి తప్పించుకునే వీలుంటుంది. కానీ.. పాలకుల నిర్ణయ లోపం తెలంగాణకు శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేలా గణాంకాలు ఉండటం గమనార్హం.
అదే సమయంలో ఏపీ సర్కారు ముందుచూపుతో వ్యవహరించిన వైనం ఇప్పుడా రాష్ట్రానికి మేలు చేకూరిందన్న మాట వినిపిస్తోంది. మహమ్మారి నిర్దారణ పరీక్షల విషయంలో జగన్ సర్కారు మహా దూకుడుగా వ్యవహరించింది. వీలైనన్ని నిర్దారణ పరీక్షలకు వెనుకాడలేదు. ఈ కారణంతోనే ఇప్పటివరకూ ఏపీలో ఏకంగా ఆరు లక్షలకు పైనే నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో తెలంగాణ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
నిర్దారణ పరీక్షలంటేనే వెనకడుగు వేసింది. అదేమంటే.. వారు చెప్పిన కారణాలు సిత్రంగా ఉన్నాయి. దీనికి తోడు మీడియాలోనూ.. పరీక్షలు తక్కువగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నను వేయటంలో విఫలమైంది. పరీక్షల్ని నిర్వహించకపోవటంలోని శాస్త్రీయతను ప్రశ్నించే విషయంలోనూ ఫెయిల్ అయ్యారన్న విమర్శ ఉంది.
నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయటం వల్ల ఏపీకి ఎలాంటి మేలు జరిగిందన్న విషయానికి వస్తే.. శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఆ రాష్ట్రంలో 6.52లక్షల నిర్దారణ పరీక్షలు చేస్తే.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4111గా తేలింది. అంటే మొత్తం పరీక్షలు వర్సెస్ పాజిటివ్ ఫలితాలు కేవలం 1.29 శాతం మాత్రమే. అదే సమయంలో.. ఒక రోజు విషయంలో ఎలా ఉందన్నది చూస్తే.. శనివారం రోజున విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 22371 మందికి పరీక్షలు నిర్వహించామని.. 491 మందికి నిర్దారణ అయినట్లుగా పేర్కొన్నారు. మొత్తం పరీక్షలు వెల్లడైన ఫలితాల శాతం చూస్తే.. 2.19 శాతంగా కనిపిస్తుంది. మొత్తం సరాసరితో పోలిస్తే.. రోజు సరాసరి ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అదేమీ పెద్ద విషయంగా అనిపించదు.
ఇక.. తెలంగాణ విషయానికి వస్తే ఇందుకు భిన్నమైన పరిస్థితి. నిర్దారణ పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరించిన విధానంపై విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షలు 53757 మాత్రమే. పాజిటివ్ గా తేలింది 7072. అంటే.. మొత్తం నిర్దారణ పరీక్షలు వర్సెస్ పాజిటివ్ గా తేలిన కేసుల్ని చూస్తే.. 13.15 శాతంగా ఉంటుంది. ఏపీలోని 1.29 శాతంతో పోలిస్తే ఇదెంత ఎక్కువో తెలుస్తుంది. ఇక.. శనివారం ఒక్కరోజున చేసిన పరీక్షలు వర్సెస్ పాజిటివ్ లను చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. శనివారం రోజులో 3188 పరీక్షలు చేస్తే.. పాజిటివ్ గా తేలింది 546. అంటే.. మొత్తం కేసులు వర్సెస్ పాజిటివ్ గా తేలింది 17.12 శాతం.
ఈ లెక్కన ఏపీలో మాదిరి పెద్ద ఎత్తున పరీక్షలు చేయిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. ఇప్పటికి చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ..పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.