హైదరాబాద్‌కు ఏమైంది? ఒక్కరోజులో అన్ని కేసులా? ఎక్కడికీ పయనం?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 5:13 AM GMT
హైదరాబాద్‌కు ఏమైంది? ఒక్కరోజులో అన్ని కేసులా? ఎక్కడికీ పయనం?

కేవలం ఏడంటే ఏడు రోజులు. ఈ ఏడు రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నో తెలుసా? అక్షరాల 1573 కేసులు. రోజురోజుకి పెరుగుతున్న కేసులతో మహానగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం నుంచి పెరిగిన పాజిటివ్ కేసులు.. ఏ రోజుకు ఆ రోజు కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి.

బుధవారం (జున్ 17) 214 పాజిటివ్ కేసులు నమోదైతే.. జూన్ 18న 302 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి రోజు 329.. తాజాగా శనివారం ఏకంగా 458 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? గతానికి భిన్నంగా కేసుల పెరుగుదలలో ఈ వేగం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7072 (శనివారం నాటికి) పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే ఐదు వేల కేసులు నమోదు కావటం గమనార్హం.

ఈ జోరు చూస్తే.. రానున్న కొద్ది రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య పదివేల వరకూ వెళ్లే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. పెద్ద ఎత్తున పెరుగుతున్న కేసులతో హైదరాబాద్ వాసులు హడలి పోతున్నారు. చాలామంది వైరస్ ముప్పు తప్పించుకోవటానికి సొంతూళ్లకు.. పల్లెలకు వెళ్లిపోవాలన్న ఆలోచన కనిపిస్తోంది.

ఇంతకీ.. హైదరాబాద్ లో ఇంత భారీగా కేసులు నమోదు కావటానికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల ముందు వరకూ నిర్దారణ పరీక్షల్ని నిర్వహించటంలో సర్కారు తీసుకున్న నిర్ణయమేనని చెప్పాలి. ఆచితూచి అన్నట్లుగా నిర్దారణ పరీక్షలు నిర్వహించే తీరుకు చెక్ పెట్టి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాజిటివ్ ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు లాక్ డౌన్ సడలింపులతో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు రావటం.. స్వీయ జాగ్రత్త విషయంలో దొర్లుతున్న తప్పులు కూడా కేసుల పెరుగుదలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ లో పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే హైదరాబాద్ కాస్తా హైడర్ బాద్ గా మారిందని చెప్పక తప్పదు.

Next Story