ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కీచకులు.. స్కెచ్ లను విడుదల చేసిన పోలీసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 1:22 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరేళ్ల బాలికను దుండగుడు కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీస్తోంది. ఈ సంఘటన హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. పోలీసులు ఎటువంటి అరెస్టులు చేయలేదు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
బాలిక తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మూడు స్కెచ్ లను గీయించి విడుదల చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముక్తేశ్వర్ ప్రాంతంలోని ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మోటార్ బైక్ లో వచ్చిన దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమె ఆచూకీ కోసం పెద్ద ఎత్తున వెతికారు. ఆ తర్వాతి రోజు గ్రామానికి సమీపంలో బాలిక స్పృహ తప్పి పడిపోయి ఉండడం కనిపించింది. బాలికను వెంటనే మీరట్ లోని ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఆ బాలికకు చాలా కాలం వరకూ వైద్యం అందించాలని.. మరిన్ని సర్జరీలు చేయాల్సి ఉందని మీరట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎస్.కె.గార్గ్ తెలిపారు.
అమ్మాయి ఉన్న పరిస్థితిలో స్టేట్మెంట్ రికార్డు చేయడం వీలుపడలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో అతి త్వరలో అరెస్టులు జరుగుతాయని.. ఇప్పటికే ఆరు టీమ్ లను ఈ కేసును చేధించడానికి పంపించామని హార్పూర్ పోలీస్ ఛీఫ్ సంజీవ్ సుమన్ తెలిపారు. ఈ ఘటనపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలికకు న్యాయం జరగాలని ప్రముఖులు కూడా కోరుతూ ఉన్నారు.