‘ఐటీ ఉద్యోగి’ అన్న అబద్ధం.. మూడు ప్రాణాల్ని బలి తీసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 10:28 AM GMT
‘ఐటీ ఉద్యోగి’ అన్న అబద్ధం.. మూడు ప్రాణాల్ని బలి  తీసుకుంది

ఈ ఉదంతం వింటే.. చేయని తప్పునకు బలైన వారిని చూసి బాధపడటం ఖాయం. తామేం తప్పు చేయకున్నా.. తప్పు చేసిన వారి చేతిలోమోసపోయిన దానికి ఏకంగా తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన వారి అమాయకత్వానికి వేదన కలగటం ఖాయం. కడప జిల్లాలో సంచలనంగా మారిన ఈ ఉదంతం..మూడు ప్రాణాల్ని తీసింది. చక్కగా సాగిపోతున్న కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన బాబుల్ రెడ్డి స్థానికంగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్. భార్య.. ఇద్దరు కూతుళ్లతో కలిసి నివిసిస్తున్నాడు. గత ఏడాది మేలో ఒక ఐటీ ఉద్యోగి సంబంధాన్ని కుదుర్చుకున్నారు. సురేశ్ అనే వ్యక్తితో ఘనంగా పెళ్లి చేశారు. సంబంధం గురించి మాట్లాడుకునే సమయంలో తాను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తుంటానని.. తనకు నెలకు రూ.80వేల జీతం వస్తుందని నమ్మించాడు. వారి మాటలకునమ్మిన వారు సంబంధానికి ఓకే చెప్పి రూ.20లక్షల కట్నం ముట్టజెప్పి భారీగా పెళ్లి చేశారు.

పెళ్లై.. కాపురానికి వెళ్లిన తర్వాత భర్తకు ఉద్యోగమే లేదన్న విషయాన్ని తెలుసుకొని.. మోసపోయినట్లుగా గుర్తించి పుట్టింటికి వచ్చేసింది. దీంతో.. ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ నడుస్తోంది. భార్యను తమ ఇంటికి పంపాలంటూ ఒత్తిడి తేవటం.. దీనిపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు అంతకంతకూ పెరగటంతో ఇంటి పెద్దను కుంగదీసింది. ఈ వేదనను భరించలేని ఆయన.. ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి మరణవార్త విని కూతుళ్లు ఇద్దరు కుమిలిపోయారు. తండ్రి లేకుండా బతకటంలో అర్థం లేదని భావించారు. అంతే..తండ్రి మరణించిన రాత్రివేళ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అక్కా చెల్లెళ్లు.. కమలాపురం రాయునిపేట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రోజు వ్యవధిలో భర్త.. ఇద్దరు కూతుళ్లు వరుస పెట్టి ఆత్మహత్య చేసుకున్న వైనంతో.. ఆ ఇంటి ఇల్లాలు విజయభారతి కన్నీరుమున్నీరు అవుతోంది.

చేయని తప్పునకు తమ కుటుంబం మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వేదన చెందుతోంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా చేయని నేరానికి ఆ కుటుంబానికి ఇంత పెద్ద శిక్ష అని బాధ పడుతున్నారు. అబద్ధం చెప్పినోడు బాగానే ఉండగా.. చేయని తప్పుకు మూడు నిండు ప్రాణాలు పోవటం షాకింగ్ గా మారింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Next Story