రాజస్థాన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 10:10 AM GMT
రాజస్థాన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఆత్మహత్య

వారికి ఏ కష్టం వచ్చిందో తెలీదు గానీ.. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. కుటుంబ స‌భ్యులంద‌రూ ఒకే సారి సూసైడ్ చేసుకోవ‌డం మిస్ట‌రీగా మారింది. ఈ విషాద ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నాళ్ల క్రితం రాజస్థాన్‌ వచ్చింది. వీరంతా హిందూ శరణార్ధులు. జోధ్‌పూర్ జిల్లా దేచు పోలీసు స్టేషన్‌ పరిధిలోని లొడ్టా గ్రామంలో ఓ ఫాంహౌజును అద్దెకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కుటుంబంలోని 12 మంది ఒకేసారి విషం తీసుకున్నారు. వీరిలో 11 మంది చనిపోగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో పురుగుల మందుల వాసన వస్తుండడంతో విషవాయువులు విడుదలవడంతో వారు మరణించి ఉంటారని బావిస్తున్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మూకుమ‍్మడిగా ఆత్మహత్యలకు పాల్పడిఉంటారని స్ధానికులు పేర్కొంటున్నారు. భారత పౌరసత్వం పొందేందుకు బాధిత కుటుంబం 2012లో పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రాంతం నుంచి భారత్‌కు తరలివచ్చింది. లాక్‌డౌన్‌ అనంతరం వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందంటున్నారు.

ఈ ఆత్మహత్యల ఘటనపై ఎస్పీ రాహుల్ బర్హాట్ మాట్లాడుతూ.. మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవన్నారు. వారు నివసిస్తున్న ఇంటిలో క్రిమిసంహారక మందు వాసన వస్తోందని.. దాన్నే వారంతా తాగి ఉంటారని బావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుడిసె బైట మాత్రం ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడని అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించామని.. అతని కోలుకుంటే అసలు జరిగిందేమిటీ? అనే విషయం తెలుస్తుందన్నారు.

Next Story