సింగర్‌ సునీత పేరుతో మోసం చేస్తున్న యువకుడి అరెస్ట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 8:13 AM GMT
సింగర్‌ సునీత పేరుతో మోసం చేస్తున్న యువకుడి అరెస్ట్

సింగర్‌ సునీత పేరును వాడుకుని మోసాలకు పాల్పడి అందినకాడికి దోచుకుంటున్న మోసగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన చైతన్య అలియాస్‌ చైతూ ఇంటర్‌ చదువును మధ్యలో ఆపేశాడు. పెద్ద గాయకుడు కావాలని హైదరాబాద్‌ వచ్చాడు. కొన్ని పాటలు పాడి ఓ యూట్యాబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అయితే.. అతడి పాటలకి రెస్పాన్స్‌ రాలేదు. సులభంగా డబ్బు సంపాదించాలని సింగర్ సునీత పేరుతో పాటు మరో ఏడు పేర్లతో మొత్తం ఎనిమిది ఫేస్‌బుక్‌ ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేశాడు.

సింగర్‌ సునీతకు తాను మేనేజర్‌నని.. స్వచ్ఛంద సేవ చేస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. సునీత పేరును చూసిన చాలా మంది ఆమె అభిమానులు సాయం చేశారు. అతని వలకు చిక్కిన వారిని వివిధ రకాలుగా మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి అందినంతా దండుకున్నాడు. ఈ విషయం సునీత దృష్టికి వెళ్లింది. కాగా గతవారం సునీత ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. చైతన్య అనే అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని.. అభిమానులెవరు వాడి వలలో పడొద్దని హెచ్చరించారు. సునీత ఫిర్యాదుతో చైతన్యను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Next Story
Share it