మోతెక్కిపోతున్న 'నక్కిలిసు గొలుసు'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 7:32 AM GMT
మోతెక్కిపోతున్న నక్కిలిసు గొలుసు

కొన్ని సినిమాలు థియేటర్లలో ఉన్నపుడు జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ తర్వాత మాత్రం మంచి సినిమా అని.. అండర్ రేటెడ్ అని.. క్లాసిక్ అని పొగిడేస్తుంటారు. ‘పలాస 1978’ కూడా ఈ కోవకు చెందిన చిత్రమే. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడటానికి ముందు రిలీజైన చివరి సినిమాల్లో ఇదొకటి. మార్చి అంటే మామూలుగానే అన్ సీజన్.

పైగా ఈసారి కరోనా తాలూకు అలజడి కూడా తోడై ఈ సినిమాకు థియేటర్లలో ఆశించిన స్పందన లేకపోయింది. నిర్మాతకు ఒరిగిందేమీ లేదు. ఐతే థియేటర్లు మూత పడి ఓటీటీల హవా నడుస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేస్తే మంచి స్పందనే వచ్చింది. అంచనాల్ని మించి ఈ చిత్రానికి వ్యూస్ వచ్చాయి. సినిమా థియేటర్లలో ఆడకపోవడం వల్ల ఇందులోని మంచి పాటలు కూడా అంతగా పాపులర్ కాలేదు.

కానీ కొంచెం ఆలస్యంగా ‘పలాస’ పాటలు జనాల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా ఇందులోని ‘నీ పక్కన పడ్డాది సూడవె పిల్లా నాది నక్కిలిసు గొలుసు’ అంటూ శ్రీకాకుళం జానపదాల స్టయిల్లో సాగే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. టీవీ డ్యాన్స్ షోల్లో ఈ పాటకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ప్రోగ్రాంలోనూ ఈ పాటను డ్యాన్సర్లు ఎంచుకుని ఫ్లోర్‌ను షేక్ చేసేస్తున్నారు.

ఇటీవల ‘ఢీ’ ప్రోగ్రాంలో ఈ పాటను చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారు. మధ్యలో టిక్ టాక్ ఫేమ్ దుర్గారావును అనుకరించడంతో ఆ వీడియో సూపర్ పాపులర్ అయింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ‘ఎడిట్’ వీరులు రంగంలోకి దిగారు. టాలీవుడ్ టాప్ స్టార్లు చేసిన వేరే మాస్ పాట స్టెప్పులకు ఈ పాట ఆడియోను జోడించి వాటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి హంగామా చేస్తున్నారు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు రఘు కుంచె వాటిని చూసి అమితానందంతో ట్విట్టర్లో షేర్ చేస్తుండటంతో ఇంకా పాపులర్ అవుతున్నాయి.

Next Story