భారతీయుడు-2 షూటింగ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు చెక్కులు అందించిన కమల్, శంకర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 12:35 PM GMT
భారతీయుడు-2 షూటింగ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు చెక్కులు అందించిన కమల్, శంకర్

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భారతీయుడు సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే..! శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఫిబ్రవరి 19న క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో కమల్ హాసన్, హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అసిస్టెంట్ డైరక్టర్లు కృష్ణ, మధు.. కేటరింగ్ వర్కర్ చంద్రన్ కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.

చిత్ర నిర్మాణ సంస్థ మరియు హీరో కమల్ హాసన్ లు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. కమల్ హాసన్ ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం అందించారు. నిర్మాణ సంస్థ లైకా ఒక్కొక్కరికి రెండు కోట్ల చొప్పున పరిహారం ను అందించారు. బాధిత కుటుంబాలను స్వయంగా కమల్ హాసన్, శంకర్ లు కలిశారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

చెన్నైకు సమీపంలోని పూనమల్లి వద్ద ఉన్న ఈవీపీ స్టూడియోలో సినిమా షూటింగ్ జరుగుతూండగా ఈ ప్రమాదం జరిగింది. లైటింగ్ ఎక్విప్ మెంట్ సెట్ చేస్తూండగా భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగిపోయి షూటింగ్ స్పాట్ లో పడిపోయింది. శంకర్, కమల్ హాసన్, కాజల్ ఈ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.

Next Story