గర్జించిన లేడీ సింగం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2020 1:17 PM ISTఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్. గుండె నిండా ధైర్య, వృత్తిపై ఎనలేని గౌరవం, విధులను కచ్చితంగా నిర్వర్తించాలన్న సంకల్పం. అందుకే కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన సమయంలో ఏదో ఒక మిషతో బైటికి వచ్చిన ఓ యువకుణ్ణి నిలదీసింది. కర్ఫ్యూ వేళ నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు తిరుగుతున్నావ్ అంటూ ఉరిమింది. అతను సారీ అనేసి ఉంటే కథ కంచికి వెళ్లేది.. కానీ సారీ చెప్పలేదు. కారణం తన స్నేహితుడు ఎమ్మెల్యే కొడుకు అన్న అహంకారమే. వ్యవస్థ అంటే లెక్కలేనితనం. వెంటనే ఫ్రెండ్ కు ఫోన్ కలిపాడు. ఉరుకులు పరుగుల మీద వచ్చిన ఎమ్మెల్యే కొడుకును కూడా సునీత చెడామడా వాయించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో అడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రాత్రికి రాత్రే ఆమె లేడీ సింగం అయింది. ఆ తర్వాత ఏమైంది?.. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో రెండ్రోజుల కిందట చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటన ఇది. వివరాలు..
కరోనా విలయతాండవం నేపథ్యంలో కంటైన్‌మెంట్లు , లాక్ డౌన్లు ఆయా సందర్భాలను బట్టి రాష్టాలు విధిస్తున్నాయి. ఆ క్రమంలోనే ప్రభుత్వం సూరత్ లో కర్ఫ్యూ విధించింది. అనుమతించిన వేళల్లోనే ప్రజలు తమ పనులు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ప్రారంభం తర్వాత ఎవరూ రోడ్డెక్కరాదు. అయితే పరచ్చ మార్గ్ నియోజకవర్గంలోని ఓ యువకుడికి ఇవేవీ పట్టలేదు. తన స్నేహితులతో కారులో హాయిగా.. హుషారుగా.. షికారు పోదమా.. అంటూ బయలు దేరాడు.
కానిస్టేబుల్ సునీతా యాదవ్ కంటబడ్డాడు. అసలే డ్యూటీ మైండెడ్ అయిన ఐరన్ లేడీ ఆమె. వెంటనే కారు ఆపి కిందకు దిగమంది. యువకుడు దిగగానే కర్ఫ్యూ కదా బైట ఏం పని మీకు.. ఎక్కడికి వెళుతున్నారు అంటూ నిలదీసింది. ప్రకాష్ ఏమాత్రం ఆలోచించకుండా తాపీగా తన స్నేహితడు ఎమ్మెల్యే, ఆరోగ్య సహాయ మంత్రి కుమార్ కనాని కుమారుడు ప్రకాష్ కు ఫోన్ చేశాడు. అతను తండ్రి కారులో ఆగమేఘాలపై వచ్చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం షురు అయ్యింది. నేనెవరో తెలుసా? అని ప్రకాష్ అడగ్గానే ఎమ్మెల్యే కుమారుడివైతే.. ఆయన ఆధికారిక వాహనంలో వచ్చేస్తావా? కర్ఫ్యూ సమయంలో బైటికి తిరగరాదని తెలియదా? ఇలా షికార్లు చేస్తుంటే మేం చేతులు ముడచుక్కూర్చోవాలా? ఏమనుకుంటున్నావ్? ఎమ్మెల్యే గారికి ఫోన్ కలుపు నేనే మాట్లాడుతా అంటూ సీరియస్ గా క్లాసు పీకింది.
ఈ ధోరణి ప్రకాష్ కు అసలు నచ్చలేదు. మంత్రి గారి కుమారుడు కారు దిగగానే ఓ మీ తాలూకా సారీ వెళ్లండి అంటుందేమో అనుకుంటే తనకే క్లాస్ తీసుకుంటుందా? ఎంత ధైర్యం అనుకున్నాడో ఏమో.. నేననుకుంటే ఏడాది పాటు నిన్ను ఇక్కడే నిలబెట్టగలను తెలుసా? అంటూ ఢంకీ ఇచ్చాడు. సునీతలో ఆవేశం కట్టలు తెగింది. పోలీసులంటే మీకు బానిసలనుకున్నావా? ఏం చేస్తావో చేసుకో ఫో అంటూ గట్టిగా బదులిచ్చింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో అందరి దృష్టీ సునీతపైనే పడింది. ఆమెను రియల్ టైం లేడీ టైగర్ అని వేనోళ్ల కీర్తించారు. అయితే ఇదంతా వర్చువల్. అసలైన కథ తర్వాత మొదలైంది. సునీతకు నోటి దురుసెక్కువ. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు...అంటూ ఆమెపై పోలీసు విచారణ షురువైంది. మొదట ఆమెను నైట్ పెట్రోలింగ్ నుంచి తప్పించారు. ఆ తర్వాత సిక్ లీవు పై వెళ్లాల్సిందిగా ఆదేశాంచారు. ఆ తర్వాత వేరే చోటికి బదిలీ చేశారు. అంతటితో ఆగకుండా అనాటి ఘటనపై విచారణ పెట్టించారు. ఈ తలనొప్పులు ఎందుకని సునీత రాజీనామా చేసింది. కథ కంచికి వెళ్లిపోయింది. పోలీసువాళ్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే ఈ ఘటన జరిగిన వెంటనే శభాష్ అన్న పోలీస్ ఫౌండేషన్ సభ్యులు తర్వాత స్వరం మార్చేశారు. మద్దతు ఇవ్వాల్సిన డిపార్ట్ మెంట్ పెద్దలు మౌనంగా మిన్నకుండి పోయారు. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ ఘటనపై పలువుకు పలు రకాలుగా స్పందించారు. ట్వీట్లు పెట్టారు.. సునీత సినిమాల్లో పోలీసు అధికారిలా కనిపించింది.
అయినా ఎమ్మెల్యే ఆరోగ్య సహాయ మంత్రి కొడుకు నిబంధనలు పాటించక పోవడమేంటి? అంటూ సినీ నటి తాప్పి స్పందించింది. మరో నటి స్వరభాస్కర్ గుజరాత్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఆమెకు తోడుగా నిల్వాలని కోరింది. ఈ కథలో మరో కోణం ఏంటంటే.. చాలా మంది నిజాయతీ పోలీసు అధికారులకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ దొరికిందో.. సునీతకూ అదే దక్కింది. తను ఆవేశంతో రాజీనామా చేసి పరోక్షంగా అధికార దర్పాన్ని గెలిపించింది. కాకపోతే నిజాయతీకి బహుమానం ఇదేనా? సరిగ్గా డ్యూటీ చేయాలనుకోవడం.. చేయడం నేరమా? ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకవు. ఏది ఏమైనా సునీత లేడీ సింగమే.. కనీసం ప్రజల గుండెల్లో అయినా..!
- రామదుర్గం మధుసూదనరావు