ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చెయ్.. లేదా ఆర్మీ ఉద్యోగాన్ని మానెయ్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 6:49 AM GMT
ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చెయ్.. లేదా ఆర్మీ ఉద్యోగాన్ని మానెయ్.!

న్యూఢిల్లీ: భారత సైన్యంలో పని చేస్తున్న వారు కొన్ని యాప్స్, సామాజిక మాధ్యమాలను వాడకూడదని తెలిపిన సంగతి తెలిసిందే. అందులో ఫేస్ బుక్ కూడా ఉంది. భారత ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సదరు సీనియర్ ఆఫీసర్ కు చీవాట్లు పెట్టింది. ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చెయడమో లేదంటే ఆర్మీలో ఉద్యోగాన్ని మానేయడమో అన్నది వారి చేతుల్లో ఉంటుందని తెలిపింది. దేశ రక్షణ కంటే సామాజిక మాధ్యమాల్లో ఉండడమేమీ గొప్ప విషయం కాదని అభిప్రాయపడింది.

జమ్మూ-కశ్మీరులో విధులు నిర్వహిస్తున్న పిటీషనర్ తాను తన సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా తన బంధుమిత్రులతో సంప్రదింపులు సాగించగలుగుతున్నానని.. తన విధి నిర్వహణకు సంబంధించిన అంశాలను తాను ఎన్నడూ ఇతరులతో పంచుకోలేదని తెలిపారు. భారత సైన్యం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలకు కట్టుబడి, ఆ నిబంధనలకు లోబడి వీటిని వాడుతున్నానని చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లోని తమ ఖాతాలను తొలగించాలని జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, సైనికుల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో సమానమని.. వాటిని వాడటానికి అనుమతి ఇస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా, జస్టిస్ ఆశా మీనన్ డివిజన్ బెంచ్ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసేందుకు తిరస్కరించింది. ఆర్మీలో ఉన్నప్పుడు సంస్థ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.. కాబట్టి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఫేస్ బుక్ కు అంత దగ్గరైనప్పుడు ఆ విషయాన్ని పేపర్ లో పెట్టండి.. మీరు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.. ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకోండని పిటీషనర్ కు తెలిపింది ధర్మాసనం. కుదిరితే ఉద్యోగం చేయడం.. లేదంటే రాజీనామా చేసి ఫేస్ బుక్ వాడుకోవడం అనే ధోరణిలో పిటీషనర్ కు చురకలు అంటించింది.

భారత ఆర్మీ కొద్దిరోజుల కిందట ఫేస్‌ బుక్‌తో సహా మొత్తం 89 యాప్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 89 రకాల యాప్‌ల నుంచి ఆర్మీ బయటకొచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్మీ 89 యాప్‌ల జాబితాను విడుదల చేసింది. ఆర్మీలో పని చేస్తున్న సైనికులు జూలై 15వ తేదీలోగా నిషేధించిన యాప్‌ల అకౌంట్లను తొలగించాని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ అకౌంట్లను తొలగించకపోతే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్మీ స్పష్టం చేసింది. ఆర్మీ సూచించిన యాప్స్‌ జాబితాలో చైనాకు చెందిన యాప్స్‌ తో పాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌ చాట్‌, డైలీ హంట్‌, షేర్‌ ఇట్‌, ట్రూ కాలర్‌, పబ్‌జీ, టిండర్‌ తదితర యాప్స్‌ ఉన్నాయి.

Next Story
Share it