సోనియా పేరు ప్రకటించాక.. ఆ నేత ఇంట్లో భారీ భేటీ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 5:26 AM GMT
సోనియా పేరు ప్రకటించాక.. ఆ నేత ఇంట్లో భారీ భేటీ?

అవసరానికి మించిన అనవసర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ కిందామీదా పడిపోయింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఆ పార్టీ తీరు ఉందని చెప్పాలి. కొత్త అధినేతను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సీడబ్ల్యూసీ సమావేశం రసాభాసాగా మారటమే కాదు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ పార్టీ బలహీనతను చాటి చెప్పాలి. కొత్త సారథికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న ఆలోచనను పక్కన పెట్టి.. తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియాకు మరో ఆర్నెల్ల పాటు పగ్గాలు అప్పజెప్పటం తెలిసిందే.

ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి కాంగ్రెస్ ఎపిసోడ్ లో ప్రధానంగా కనిపించిన ఇద్దరు నేతల్లో ఒకరు గులాం నబీ అజాద్ అయితే మరొకరు కపిల్ సిబల్. వీరిద్దరు ఎంత రచ్చ చేయాలో అంత చేశారు. సోషల్ మీడియాలో వీరు చేసిన పోస్టుల కారణంగా భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

తుపాను కాస్తా టీ కప్పులో తుపానుగా మార్చేసి సాయంత్రానికి సోనియాకు పగ్గాలు అప్పజెప్పిన తర్వాత గులాం నబీ అజాద్ ఇంట్లో చోటు చేసుకున్న సన్నివేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆయన ఇంటికి వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా చూస్తే.. సీనియర్లకు ఆయన నాయకత్వం వహిస్తున్నారన్న భావన కలిగేలా పరిస్థితి ఉందని చెప్పాలి.

Advertisement

అజాద్ ఇంటికి వెళ్లిన వారిలో కపిల్ సిబాల్.. శశిథరూర్.. మనీష్ తివారీ.. ముకుల్ వాస్నిక్ లు హాజరయ్యారు. వారి భేటీ సుదీర్ఘంగా సాగినట్లుగా చెబుతున్నారు. సీనియర్ల మీద రాహుల్ ఫైర్ కావటం తెలిసిందే. అనంతరం ఆయన తీరును సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. తామంతా హర్ట్ అయ్యామన్న మాటను తీసుకురావటం ద్వారా అధినాయకత్వాన్ని డిఫెన్స్ లో పడేశారు. సదరు సమస్యకు పరిష్కారంగా సోనియమ్మ చేతిలోనే పార్టీ పగ్గాలు ఉంచేసి కథను తాత్కాలికంగా కంచికి పంపేసిన సీనియర్లు.. ఆ తర్వాత తామంతా కలిసి భేటీ కావటం చూస్తుంటే.. కాంగ్రెస్ అధిష్టానం వారి ఎత్తులకు తగ్గట్లు నడుచుకోవాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది.

Next Story
Share it