సద్దుమణిగిన‌ సంక్షోభం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  25 Aug 2020 12:59 PM IST
సద్దుమణిగిన‌ సంక్షోభం..!

కాంగ్రెస్‌కు అసమ్మతులు కొత్తకాదు. దానిని వారు అంతర్గత ప్రజాస్వామ్యం అంటుంటారు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎవరు? అన్న వివాదం నేపథ్యంలో తాజాగా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది. విమర్శలు.. ప్రతి విమర్శలు.. అలకలు.. బుజ్జగింపులు సీనియర్ల తీరుపై రాహుల్, ప్రియాంకలతోపాటు పలువురి ఆగ్రహాలు.. కొందరి వివరణలతో 7 గంటలపాటు సాగిన సమావేశం హోరెత్తి పోయింది. అసమ్మతి నేతల లేఖపై రాహుల్‌ విరుచుకు పడగా.. అజాద్‌ను ప్రియాంకా నిలదీశారు. ఈ హోరు.. ఈ జోరు చూసిన వారికి ఇదేదో పెద్ద దుమారమే రేగేలాగుంది అనిపించినా.. చివరికి టీ కప్పులో తుఫానులా చల్లబడింది.

సోనియాగాంధీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి సిద్ధపడినా.. మళ్ళీ ఆమెకే పార్టీ పగ్గాలు అప్పగిస్తూ సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీ కష్టాల సమయంలో ఆదుకుంటున్నది గాంధీ కుటుంబమే కాబట్టి వారే అధ్యక్షత వహించాలని పలువురు పార్టీ నేతల కార్యకర్తల భావన. ఇందిరాగాంధీ కుటుంబం చెరిష్మా పార్టీని బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని వారి ఆలోచన. సమావేశంలో సోనియాగాంధీ నేతృత్వాన్ని బలపరిచే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. వ్యతిరేక స్వరాలు వినిపించాయి. సోమవారం వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరిగింది. అయితే అధ్యక్ష పదవికి సంబంధించి సీనియర్‌ లేఖలు పెద్ద వివాదాన్నే సృష్టించాయి. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలిచింది. ఈ వివాదానికి కారణంగా నిలుస్తున్న సిబాల్‌ తను చేసిన ట్వీట్‌ను.. రాహుల్‌ జోక్యంతో తొలగించారు.

‘మేం బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్‌ గాంధీ అంటున్నారు. అయితే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వాదించి సఫలమయ్యింది మేమే. మణిపూర్‌లో పార్టీ తరపున పోరాడాము. గత 30 ఏళ్ళలో బీజేపీకి మావల్ల ఒనగూరిన ఒక్క మేలు లేదు. అయినా మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటున్నారు’ ఇదీ సిబాల్‌ ట్వీట్‌ సారాంశం. ఈ ట్వీట్‌ను గమనిస్తే సిబాల్‌ ఎంత మనస్తాపానికి గురయ్యారో తెలుస్తోంది.

అయితే రాహుల్‌ గాంధీని అంత ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్‌ చేసిన సీనియర్‌ నేత సిబాల్‌ ఎందుకు తొలగించారో.. రాహుల్‌ తనతో ఏం చెప్పారో అన్నది ఆసక్తికర అంశంగా మారింది.. సమావేశంలో రాహుల్‌ గాంధీ తమ ప్రసంగంలో లేఖపై సంతకాలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖ రాసిన సందర్భం సరికాదని ఆయన అన్నారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్‌లో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు లేఖ రాయడమేంటి? అని ఆయన ఘాటుగానే విమర్శించారు.

అయితే సమావేశం జరుగుతున్నప్పుడు ఈ సందర్భానికి సంబంధించి బైట లీకులు వెలువడ్డాయి. వెంటనే ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ దుమారమే రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్‌ అన్నట్టు ట్వీట్‌లో ఉండటంతో సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ దానికి దీటుగా ఓ ట్వీట్‌ చేశారు. ఇది నిప్పుకు గాలి తోడయినట్లయింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ రంగంలో దిగి రాహుల్‌ గాంధీ అలాంటి మాటలేవీ అనలేదని ట్వీట్‌ చేశారు. ఇదంతా మీడియా తప్పుడు ప్రచారమని ఎవరూ నమ్మరాదని ఆయన కోరారు. మనలో మనం గొడవపడటం కాదు...అందరూ కలిసికట్టుగా మోదీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఇదే అనికూడా ఆయన తెలిపారు.

అయితే రాహుల్‌ గాంధీ, కపిల్‌ సిబాల్‌ ల ట్వీట్ల మాటెలా ఉన్నా రణ్‌దీప్‌ చేసిన ట్వీట్‌ పార్టీలో విభేదాలున్నాయన్న విషయానికి తావిచ్చేలా ఉందని కొందరి అభిప్రాయం. కపిల్‌తో రాహుల్‌ స్వయంగా తానలా అనలేదని చెప్పడంతో ఆయన తన ట్వీట్‌ను తొలగించారు. అయితే పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసే అధ్యక్షులు అవసరమని పార్టీకి రాసిన లేఖలో సంతకం చేసిన వారిలో సిబాల్‌ ఒకరు.

కపిల్‌ సిబాల్‌ దుమారం చాలదన్నట్టు గులాంనబీ అజాద్‌ కూడా ట్వీటారు. తాము బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాసినట్టు రాహుల్‌ గాంధీగానీ సీడబ్ల్యూ సీ గానీ సమావేశంలో ఎక్కడా అనలేదు. అయితే కొందరు నాయకులు.. మేము బీజేపీతో కుమ్మక్కయి ఉత్తరం రాశామని ప్రచారం చేయడాన్ని తప్పు బడుతున్నాం అంతే. ఒకవేళ మేం కుమ్మక్కయినట్లు రుజువైతే వెంటనే రాజీనామా చేస్తా’ అంటూ అజాద్‌ కాసింత ఆవేశంగానే ట్వీట్‌ చేశారు.

అయితే సోనియాగాంధీ మాట్లాడుతూ.. ‘మనది పెద్ద కుటంబం. చాలా సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటుంటాం. ప్రజాస్వామ్యయుత పార్టీలో ఇది చాలా సహజం. అయితే ప్రజా పోరాటంలో మాత్రం అందరూ కలిసికట్టుగానే పోరాడాలి’ అని పిలుపునిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాగాంధీ ప్రెసిడెంటుగా ఉండాలని గట్టిగా కోరిన ప్రముఖుల్లో మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రారంభమ్యేదాకా సోనియా చేతిలోనే పార్టీ పగ్గాలుండాలని ఆయన తెలిపారు. పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లే లేఖ రాయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంటోని మాట్లాడుతూ...లేఖ కన్నా లేఖలో అంశాలు చాలా కఠినంగా ఉన్నాయని విమర్శించారు.

సమావేశం వాడీ వేడిగా సాగినా చివరికి శుభం కార్డు పడిందని అందరూ భావించారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ అధ్యక్ష స్థానం పైనే భిన్నస్వరాలు వినిపించడంతో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో అని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే సమావేశానంతరం కొందరు నేతలు గులాంనబీ అజాద్‌ ఇంటిలో సమావేశం కావడం కొసమెరుపు. ఈ భేటీలో కపిల్‌సిబాల్, శశి థరూర్, ముకుల్‌ వాస్నిక్, మనిష్‌ తివారీలున్నారు.

Next Story