ఆ రాష్ట్ర సీఎం నోటి వెంట వచ్చిన సంచలన వ్యాఖ్యల్ని విన్నారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 July 2020 3:00 PM ISTఇవాల్టి రోజున పదిలక్షలు దాటిన కరోనా కేసులకు ఆరంభం కేరళ రాష్ట్రమే. దేశంలో మొదటి కరోనా కేసు ఆ రాష్ట్రంలోనే షురూ అయ్యింది. ఆ మాటకు వస్తే దేశంలో నమోదైన మొదటి యాభై పాజిటివ్ కేసుల్లో అత్యధికం కేరళలోనే అన్నది మర్చిపోకూడదు. అయితే.. తమ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం ద్వారా.. కేరళ రాష్ట్రంలో కేసుల వేగానికి పగ్గాలు వేయటమే కాదు..ఒక దశలో కేసుల తీవ్రతదాదాపుగా తగ్గిపోయిందన్న భావనకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీద పెద్ద ఎత్తున ప్రశంసల జల్లులు కురిశాయి. ఆయన సీపీఐ (ఎం) పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించటంతో.. ఆయన ప్రభుత్వం చేసిన దానికి తగ్గ పేరుప్రఖ్యాతులు రాలేదనే చెప్పాలి. ఇలాంటి వేళ.. ఆయన పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యే ఉదంతం ఈ మధ్యన ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
అనూహ్యంగా వారం క్రితం తిరువనంతపురం దగ్గర్లోని ఒక చేపలమార్కెట్ ద్వారా వ్యాపించిన వైరస్ తో మొదలైన కరోనా పాజిటివ్ లు ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటివరకూ రోజుకు పది.. పదిహేను కేసులు మాత్రమే నమోదయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు రోజు ఐదారు వందల కేసులు నమోదువుతున్నాయి. ఇలాంటి వేళలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
భారతదేశంలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందన్నారు. దేశంలో ఇప్పటివరకు పది లక్షల కేసులు నమోదైనా.. పాతిక వేల మరణాలు చోటు చేసుకున్నా.. కేంద్రం సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రకటించలేదు. అందుకు భిన్నంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటంతో అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా.. పూన్ తురా గ్రామాల్లో వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారన్నారు.వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందన్నారు.
పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరీక్షించగా 51 మందికి.. పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా 26 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో.. తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ వ్యాపించిందంటూ గణాంకాలతో సహా ప్రకటించిన వైనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కేరళలోనే అలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన రాష్ట్రాల సంగతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.