లాక్‌డౌన్‌ పొడిగించం.. వదంతులు నమ్మొద్దు: సీఎం

By సుభాష్  Published on  18 July 2020 2:35 AM GMT
లాక్‌డౌన్‌ పొడిగించం.. వదంతులు నమ్మొద్దు: సీఎం

కర్ణాటక రాజధాని బెంగళూరులో లాక్‌డౌన్‌ పొడిగింపు చేసే ఆలోచన లేదని ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టం చేశారు. ముందు నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈనెల 23 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ విధించామని, ఆ తర్వాత పొడిగింపు చేసే ఆలోచన లేదని అన్నారు. అయితే లాక్‌డౌన్‌ పొడిగిస్తారని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయని, అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారు ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకుండా లేదన్నారు. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదన్నారు. శుక్రవారం బెంగళూరులోని ఎనిమిది జోన్ల ఇన్‌చార్జి మంత్రులతో సీఎం యడ్యూరప్ప సమావేశం అయ్యారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడి కరోనా, హోం క్వారంటైన్‌ విషయాలపై చర్చించాలని మంత్రులకు సూచించారు. లక్షణాలు కనిపించని రోగులను హోంక్వారంటైన్‌లో ఉండేలా చూడాలని అన్నారు. అలాగే కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ఇళ్లలోనే మృతి చెందితే వారికి ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేసి అంత్యక్రియలు త్వరగా నిర్వహించేలా చూడాలన్నారు.

వైద్య పోస్టులను భర్తీ చేస్తాం

ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. ప్రతి వార్డులో వాలంటీర్‌తో పాటు అంబులెన్స్‌ లను కేటాయించాలన్నారు. కరోనా రోగులను ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రతి రోజు కరోనా పరీక్షలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం మంత్రులకు సూచించారు. జనాలు గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఇక కరోనా సోకిన రోగుల్లో 65 దాటినట్లయితే వారికి ప్రత్యేక బెడ్లు కేటాయించాలన్నారు. లక్షణాలు లేనివారికి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించాలని సూచించారు.

Next Story