శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Sept 2020 7:02 PM ISTసీఎం జగన్ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. జగన్ పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముందుగా ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తర్వాత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు జగన్‌కు పరివట్టం కట్టారు. సంప్రదాయ వస్త్రధారణతో సీఎం నుదుట నామాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఊరేగింపుగా జగన్ బయలుదేరారు. సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి సమర్పించే సారెను తీసుకుని.. మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమం అనంతరం జగన్ వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొంటారు. అంతకుముందు.. జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని మద్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం సీఎం జగన్ రోడ్డుమార్గాన తిరుమలకు చేరుకున్నారు.