వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించిన సీఎం జగన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 11:51 AM IST
వైఎస్సార్‌ చేయూతను ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

వైఎస్సార్‌ చేయూతలో భాగంగా బుధవారం మొదటి విడత సాయంగా సీఎం జ‌గ‌న్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. బడ్జెట్‌లో వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.4,700కోట్లు కేటాయించారు. దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు.

ఇదిలావుంటే.. లబ్ధిదారుల సాధికారిత కోసం ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీ అండ్‌ జీ, జియోమార్ట్‌ లాంటి ప్రఖ్యాత, దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఔత్సాహిక వ్యాపారస్తులుగా మారడానికి అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్‌ సహకారాలను ఈ కంపెనీలు అందిస్తాయి. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం అవకాశాలను కల్పిస్తాయి. ఈ కంపెనీల భాగస్వామ్యం వల్ల వారికి జీవనోపాధి కలగడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి.

Next Story