వాతావరణంలో తీవ్రస్థాయి మార్పులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 7:16 AM GMT
వాతావరణంలో తీవ్రస్థాయి మార్పులు..!

హైదరాబాద్ : 2019లో భారత్ ను ముంచెత్తిన వరదలు పెను విలయాన్ని సృష్టించాయి. మునుపెన్నడూ లేనంత నష్టాన్ని దేశం ఈసారి వరదల కారణంగా చవిచూడాల్సి వచ్చింది. ప్రాణనష్టం, పశునష్టం మాత్రమే కాక లక్షల ఎకరాల పంటపొలాలు ఇసుక మేటవేసి బీడు భూములుగా మారాయి. ఈ పెను విలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

హోంమంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం 2019లో వచ్చిన వరదలు భారతదేశాన్ని పూర్తిగా వణికించాయి. మొత్తంగా దేశంలో ఈ వరదల్లో 2,391మంది మనుషులు, 15,729 పశువులు ప్రాణాలు కోల్పోగా 63.9 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి పూర్తిగా బీడుపడిపోయింది.

దీనికి సంబంధించి లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం దాదాపుగా 800,067 ఇళ్లు ఈ వరదల వల్ల ధ్వంసమయ్యాయి. వరద నీరు పారినందు వల్ల ఇసుక మేటవేసి 63.975 లక్షల హెక్టార్ల సాగుభూమి పూర్తిగా బీడుపడిపోయింది. ఈ భూముల్లో పండిన పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

2019లో వచ్చిన వరదల్లో అనేక రాష్ట్రాలు అతలాకుతలమైపోయాయి. భూతల స్వర్గంగా అందరూ చెప్పుకునే కేరళ రాష్ట్రం తీవ్రాతి తీవ్రమైన స్థాయిలో ఋతుపవనాల వల్ల కురిసిన వర్షాలు, వాటి కారణంగా వచ్చిన వరదల్లో పూర్తిగా నష్టపోయింది. కేరళలో వరదల వల్ల 21,264 ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం 674 మరణాలతో వరద భీభత్సానికి పరాకాష్టగా నిలిచింది. మహారాష్ట్ర 253 వరద మరణాలతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ లో నర్మదానదికి వచ్చిన వరదల కారణంగా వేలాదిమంది రోడ్లపాలయ్యారు. వందల భవనాలు నేలమట్టమయ్యాయి.

ఈ వరదలు నిట్టనిలువునా ఎందరి ప్రాణాలనో తమలో కలిపేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో అధికారులు 28 ప్రాజెక్టుల్లో ఏడు ప్రాజెక్టులకు వరద ప్రవాహాన్ని నియంత్రించలేక పూర్తిగా గేట్లను ఎత్తివేశారు. దాదాపుగా వెయ్యిమందిని లోతట్టు ప్రాంతాలనుంచి ఆగమేఘాలమీద సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కేరళ, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అసోం, బీహార్ రాష్ట్రాలు వరద తాకిడికి అతలాకుతలమయ్యాయి. మహారాష్ట్రలో ముఖ్య నగరమైన పుణే వరద తాకిడికి అల్లల్లాడిపోయింది. మూలి, ముల్గి నదులు పోటెత్తడంతో పుణేలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై జనజీవనం స్తంభించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పుణేలో నదిమీద నిర్మించిన ఆనకట్టల్లో అధికశాతం బ్రిడ్జ్ లపైనుంచి నీరు పొంగి పొర్లింది.

ఈ వరదల్లో అందరికంటే అత్యధికంగా నష్టపోయిన వర్గం రైతులే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 63.975 లక్షల హెక్టార్ల భూమి బీడుపడిపోయింది. తీవ్రస్థాయిలో పంటనష్టం జరిగి ఆరుగాలం కష్టించిన రైతన్నలు రోడ్డుమీద పడ్డారు. 27.36 లక్షల హెక్టార్ల సాగుభూమి పాడైపోయి రాజస్థాన్ సాగుభూముల నష్టంలో మొదటిస్థానంలో ఉండగా, 9.35 లక్షల హెక్టార్ల సాగుభూమి నష్టంతో కర్నాటక రెండవ స్థానంలో నిలిచింది.



సాగు భూముల నష్టంపై ప్రభుత్వం ప్రతిస్పందన

వరద కారణంగా తీవ్ర స్థాయిలో నష్టపోయిన, బీడుపడిన సాగు భూములను పునరుద్ధరించేందుకు, తిరిగి సాగుకు యోగ్యంగా మార్చేందుకు హైదరాబాద్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ లు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశాయి.

రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఈ రెండు సంస్థలూ రైతులను ఆదుకోగలిగే ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి అందించాయి. ఇకపై పూర్తి స్థాయిలో వాతావరణానికి సంబంధించిన మార్పులను ముందస్తుగా రైతులకు తెలిపే విధివిధానాలతోకూడిన సరికొత్త ప్రణాళికను ఇవి రూపొందించాయి.

వరదలవల్ల భారీ ప్రాణ నష్టం జరిగిన రాష్ట్రాల జాబితా :

1. మధ్యప్రదేశ్ : 674

2. మహారాష్ట్ర : 253

3. పశ్చిమ బెంగాల్ : 227

4. గుజరాత్ : 195

5. ఉత్తర్ ప్రదేశ్ : 133

6. బీహార్ : 133

7. రాజస్థాన్ : 126

8. కేరళ : 125

9. అసోం : 103

10. కర్నాటక : 91

వరదలవల్ల భారీ పశునష్టం జరిగిన రాష్ట్రాల జాబితా :

1. మహారాష్ట్ర : 4,230

2. కర్నాటక : 3,400

3. మధ్యప్రదేశ్ : 1,888

4. కేరళ : 1,183

5. సిక్కిం : 1,304

Next Story