కొన్ని రాజకీయ పార్టీలు పాక్ బాటను అనుసరిస్తున్నాయి: మోదీ

By సుభాష్  Published on  11 Dec 2019 8:28 AM GMT
కొన్ని రాజకీయ పార్టీలు పాక్ బాటను అనుసరిస్తున్నాయి: మోదీ

పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలో పాకిస్థాన్‌ దారినే అనుసరిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చరిత్రలో గుర్తిండిపోయే బిల్లును వ్యతిరేకించడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం లోక్‌ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆందోళనల మధ్య పౌరసత్వ సవరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. మూడు పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుందన్నారు. ఈ బిల్లు వల్ల లౌకిక రాజ్యభావనకు భంగం కలుగుతుందని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నారు. పౌరసత్వ బిల్లు ద్వారా విదేశాల్లో శరణార్థులుగా ఉన్న ఎంతో మందికి ఊరట లభించిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని అధికార పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. పౌరసత్వ బిల్లుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఎంపీలకు సూచించారు.

ఈ క్రమంలో ఆందోళనల మధ్య పౌరసత్వ సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్న బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ బిల్లుపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడిన విషయం తెలిసిందే

Next Story