కేంద్ర సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన పౌరసత్వ సవరణ చట్టం వల్ల రాజకీయ వేడి రాజుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళన ఉధృతమవుతున్నాయి. విద్యార్థులు ఆందోళనను ఉద్రిక్తం చేస్తున్నారు. ముందుగా ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన హింసాత్మక సంఘటనలు క్రమ క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో సైతం ప్రకంపనలు రేపుతున్నాయి. మతపరంగా సున్నితమైన హైదరాబాద్‌ లోనూ ఈ ఆందోళన తాకిడి మొదలైంది.

పక్కా ప్లాన్‌తో ముందుకు..

బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్గనిస్తాన్ కు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు రాజకీయ అంశంగా తెరపైకి వస్తోంది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలతో పాటు లోక్ సభలోనూ భారీ ఆధిక్యం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చింది. వాస్తవానికి రాజ్యసభలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని భావించినప్పటికీ వ్యూహాత్మకమైన ప్లాన్‌తో ముందుకెళ్లింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తేవడంలో విఫలమై చేతులెత్తేయడంతో రాజ్యసభలోనూ అడ్డంకులు ఎదురు కాలేదనే చెప్పాలి. ఈ విషయంలో సవరణ చట్టం రూపుదాల్చినప్పటికీ ప్రజల్లో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండంతో శాంతిభద్రతల సమస్య అధికమవుతోంది. ముఖ్యంగా అసోం వంటి ప్రాంతంలో పరిస్థితి అసాధారణంగా ఉంది. కర్ఫ్యూ విధింపు, అల్లర్లు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వంటి తాత్కాలిక చర్యలతో ఆందోళనలను అదుపు చేస్తున్నారు పోలీసులు. పశ్చిమబంగలోనూ కొన్ని జిల్లాలు ఇంకా నిరసన సెగలు జోరందుకుంటున్నాయి.

ఎక్కడ ఓటు బ్యాంకు ఉంటుందో అక్కడ రాజకీయాలూ..

ఎక్కడ ఓటు బ్యాంకు ఉంటుందో అక్కడ రాజకీయాలూ రంగప్రవేశం చేస్తుంటాయి. హింసాత్మక ఘటనలు అధికమవుతుండటంతో కాంగ్రెసు పార్టీ విధ్వంసాలకు కారణంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. శాంతియుతమైన ఆందోళనలకు తాము అండగా ఉంటామని కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్ బహిరంగంగానే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరు ఆయా రాష్ట్రాల్లో నిరసనలకు మద్దతు పలుకుతున్నారు.

ఈ సెగలు హైదరాబాద్‌కు తాకనుందా..?

పౌర సత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు మతపరంగా హైదరాబాద్‌ నగరానికి తాకుతున్నట్లు కనిపిస్తోంది. మౌలానా అజాద్ యూనివర్శిటీ విద్యార్థుల రాత్రిపూట ధర్నాలకు దిగారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఈచట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారపార్టీ టీఆర్ఎస్ సైతం వ్యతిరేకిస్తోంది. ఇవన్నీ కలగలిసి కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజకీయ కుంపటిపుట్టించేలా కనిపిస్తోంది. తమను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు ఏకమవుతాయన్న విషయం బీజేపీ ముందుగానే పసిగట్టాయి. కాగా, దీనిపై ఎంతగా చర్చ సాగి, రచ్చ రచ్చ జరిగితే అంత మేలనే భావనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా చట్టం రాజ్యాంగబద్ధత, జాతీయంగా పౌరసత్వ నమోదు అమలు వంటి విషయాలపై న్యాయసమీక్షకు సుప్రీం కోర్టు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.