చైనా వైఖరిలో ఈ మార్పు ఏమిటో..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2020 10:19 AM GMTభారత్-చైనా దేశాల మధ్య ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఘటనలను ప్రపంచం మొత్తం గమనిస్తూ వస్తోంది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు భారత్ ధీటుగా బదులిస్తూ ఉండడంతో చైనా తోకముడచాల్సి వస్తోంది. భారత్ ఆర్థికంగా కూడా చైనాను దెబ్బతీస్తూ ఉండడంతో చైనా వైఖరిలో ఊహించని మార్పు వస్తోంది.
భారత్ లోని చైనా రాయబారి వేడాంగ్ మాట్లాడుతూ.. భారత్ తో తాము ఎప్పుడూ స్నేహాన్ని, సత్సంబంధాలనే కోరుకుంటామని.. భారత్ కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదని అన్నారు. కీలక అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య స్పష్టమైన అవగాహన రావాల్సి ఉందని.. ఇప్పుడు ఉన్న విభేదాలు, వివాదాలను చూపి వేల సంవత్సరాలుగా ఉన్న సత్సంబంధాల చరిత్రను మరవడం సరికాదని అన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు, వ్యాపార బంధాలను బలవంతంగా రద్దు చేసుకుంటే అది రెండు దేశాలకు ఓటమిగా మిగిలిపోతుందని అన్నారు.
ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ చైనా జోక్యం చేసుకోదని.. ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కూడా కోరుతున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాయబారి అలా మాట్లాడుతూ ఉంటే.. చైనా సైన్యంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. చైనా భారత్ విషయంలో వెనక్కు తగ్గినట్లుగానే తగ్గి.. దూసుకుని వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కమాండర్ స్థాయిలో జరిగిన చర్చల తర్వాత గల్వాన్ ప్రాంతాల నుంచి చైనా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గింది. కానీ ఆ ప్రాంతంలో ఇంకా భారీ స్థాయిలో తన దళాలను మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. 40వేల మంది సైన్యం అక్కడ ఉండవచ్చని ఆర్మీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వెనక్కి వెళ్లేందుకు చైనా దళాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నట్లుగా తెలుస్తోంది.