అమెరికాకు ఆ విధంగా బదులిచ్చిన చైనా.. ఇంతలో గూఢచారిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 11:20 AM GMT
అమెరికాకు ఆ విధంగా బదులిచ్చిన చైనా.. ఇంతలో గూఢచారిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య బంధాలు అంత గొప్పగా లేవని ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిందే..! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు చూసినా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నాయి. అమెరికా లోని చైనా రాయబార కార్యాలయాలు గూఢచర్యానికి పాల్పడుతున్నాయని భావించిన అమెరికా వాటిని మూసివేయించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖా మంత్రి స్వయంగా తెలిపారు. హ్యూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయంలో గూఢాచర్యానికి సంబంధించిన సమగ్ర చర్చలు జరుగుతూ ఉన్నాయని.. ఆ కారణం చేతనే మూసివేయించామన్నారు.

అమెరికాకు చెందిన కీలక రహస్యాలు చైనా సంపాదిస్తోందని ఆరోపించారు. అమెరికాకు చెందిన వ్యాపార రహస్యాలను తీసుకుని అమెరికన్లు లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందని చెప్పుకొచ్చారు. చైనా కుట్రలను ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఆయన అన్నారు. హ్యూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయం మాత్రమే కాదు మరిన్ని కూడా మూసివేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

దీనిపై చైనా కూడా ధీటుగానే బదులిచ్చింది. చైనా లోని చెంగ్డు నగరంలో ఉన్న అమెరికా కాన్సులేట్ లైసెన్సును రద్దు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, చెంగ్డులో ఉన్న అమెరికా కాన్సులేట్ లైసెన్సును రద్దు చేస్తూ తీసుకున్న చర్య చట్టబద్ధమైనది, అవసరమైనది అని తెలిపింది. అమెరికా అసమంజసంగా తీసుకున్న చర్యలకు న్యాయమైన, అవసరమైన స్పందన అని తెలిపింది.

చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించిన అమెరికా అందుకు తగ్గట్టుగానే ఓ గూఢచారిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించింది. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) పరిశోధకురాలి వేషంలో గూఢచర్యానికి పాల్పడుతున్న చైనా మిలటరీ మహిళా వైద్యాధికారిని అరెస్టు చేసింది. చైనా రాయబార కార్యాలయంలో తలదాచుకున్న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)లో పౌర వైద్యాధికారిగా పనిచేసే టాంగ్‌ జువాన్‌గా గుర్తించారు.

Next Story