దళిత యువకుడు శిరోముండనం ఘటనపై స్పందించిన చంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on 21 July 2020 7:22 PM ISTసభ్య సమాజం సిగ్గుపడే ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో జరిగింది. ఓ దళిత యువకుడిపై పోలీసులు అమానుషంగా దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే యువకుడిని కొట్టి, గుండు గీయించారు. ఇసుక లారీలను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక ముని కూడలి వద్ద వైకాపా నాయకులు కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు.
కాగా.. ఈ ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఎస్సైను సస్పెండ్ చేసినంత మాత్రాన సరిపోదని, బాధ్యులైన అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని.. లేనిపక్షంలో ఏం చేస్తామో చేసి చూపిస్తామని హెచ్చరించారు. సీతానగరం వద్ద అక్రమ ఇసుక ర్యాంపుల్నీ నిలిపివేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
ఆటవిక పాలన మళ్లీ వచ్చింది.. చంద్రబాబు
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు స్పందించారు. ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించడమే ఆ యువకుడి నేరమైందని ఆక్రోశించారు. ఓ దళితుడి ఆత్మగౌరవాన్ని దారుణాతిదారుణంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అటవిక పాలన మళ్లీ వచ్చిందని ఈ ఘటనతో తేటతెల్లమైందన్నారు. ఏపీలో పోలీసులకు ఏమైందని ప్రశ్నించారు. అవినీతిపరులైన అధికార పక్ష నేత చేతిలో వాళ్లు కీలుబొమ్మల్లా మారారని, ఇది నిజంగా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. బాధిత యువకుడికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తామన్నారు.