బాబుకు కరోనా భయం.. అందుకే లోకేష్‌తో..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2020 3:40 AM GMTఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. క్లిష్ట సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతలే జీర్ణించుకోలేని విధంగా ఉందంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన చంద్రబాబు ఆకస్మాత్తుగా ఏపీలో పర్యటించడం, అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనం అవడం గందరగోళాన్ని సృష్టిస్తోందని అంటున్నారు.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు సంసిద్ధుడైన సంగతి తెలిసిందే. విమానంలో వైజాగ్ చేరాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే, విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో విశాఖ పర్యటన రద్దు అయింది. అనంతరం ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమాలు ఉండటంతో రోడ్డు మార్గాన విజయవాడ చేరుకున్నారు. అక్కడే రెండు రోజుల పాటు ఆ కార్యక్రమాలు చూసుకున్నారు. కానీ అనంతరం ఆయన ఆకస్మాత్తుగా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. తన కుమారుడు, పార్టీ యువనేత నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లారు.
చంద్రబాబు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవడంలో ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ, ఆయన ఈ సమయంలో వెనక్కి రావడం, పైగా ఏపీలో పర్యటనకు ముందు ఆయన చేసిన హడావుడి గురించి చర్చ జరుగుతోంది. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగుపెట్టిన అనంతరం విశాఖలోని బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నది పెద్ద ప్రశ్న. కరోనా కేసుల కలకలం కొనసాగుతున్న తరుణంలో ఆ వైరస్‌కు భయపడే బాబు తిరుగుటపాలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారా? అంటూ సోషల్ మీడియాలో సహజంగానే సెటైర్లు పేలుతున్నాయి.