రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌కు (RAAG) చెందిన వివిధ సంస్థలు సుమారు రూ. 73,006 కోట్ల మేర బ్యాంక్ లోన్ మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌లో దర్యాప్తు సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. అనిల్ అంబానీ గ్రూప్‌పై మొత్తం ఏడు సిబిఐ కేసులు, ఎనిమిది ఈడీ కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో కొందరు ప్రభుత్వ అధికారుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. ముఖ్యంగా "ప్రాజెక్ట్ హెల్ప్" పేరుతో దివాలా ప్రక్రియను (Insolvency) ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని, రూ. 2,983 కోట్ల క్లెయిమ్‌లను కేవలం రూ. 26 కోట్లకే సెటిల్ చేశారని ఈడీ కోర్టుకు వివరించింది.
ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రీంకోర్టు.. దర్యాప్తు సంస్థలు అత్యున్నత స్థాయి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. ఆర్థిక సంస్థల్లోని ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరిగాయా అనే కోణంలో లోతుగా విచారణ జరపాలని సూచించింది. ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐ, ఈడీలను ఆదేశించింది. అలాగే ఈ విచారణకు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు పూర్తిస్థాయిలో సహకరించాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.