25% సుంకం విధించినా.. భార‌త్‌లో త‌యారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!

అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకుంటే యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ తయారీదారు ఆపిల్‌ను బెదిరించారు.

By Medi Samrat
Published on : 24 May 2025 3:16 PM IST

25% సుంకం విధించినా.. భార‌త్‌లో త‌యారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!

అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకుంటే యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ తయారీదారు ఆపిల్‌ను బెదిరించారు. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఐఫోన్‌ల తయారీని నిషేధించాలని గతంలో అమెరికా అధ్యక్షుడు కంపెనీని బెదిరించారు. ఐఫోన్‌ను అమెరికాలోనే తయారు చేయాలని కూడా చెప్పారు.

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) నివేదిక ప్రకారం.. యుఎస్ ప్రెసిడెంట్ భారతదేశంలో తయారయ్యే ఐఫోన్‌లపై 25% సుంకం విధించినప్పటికీ.. అమెరికాలోని పరికరాల తయారీ కంటే మొత్తం ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అంటే 25% టారిఫ్ తర్వాత కూడా ఇండియాలో తయారయ్యే ఐఫోన్లు అమెరికా ప్రజలకు తక్కువ ధరకే లభిస్తాయి.

25% సుంకం విధించడం వల్ల భారతదేశంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతుందనే అభిప్రాయాన్ని GTRI నివేదిక తిరస్కరించింది. ఐఫోన్ ఉత్పత్తి విలువను పరిశీలిస్తే.. 1,000 డాలర్ల విలువైన ఐఫోన్‌ను వివిధ దేశాలు అందించాయని, వాటిలో అత్యధిక వాటా యాపిల్‌దేనని నివేదిక పేర్కొంది. కంపెనీ బ్రాండ్, సాఫ్ట్‌వేర్, డిజైన్‌పై మాత్రమే దాదాపు $450 ధరను ఉంచుతుంది. ఐఫోన్‌ను తయారీలో ఆపిల్ మాత్రమే కాకుండా వివిధ దేశాలు పాలుపంచుకుంటాయి. సాఫ్ట్‌వేర్ నుండి డిజైన్ వరకు అనేక దేశాలు పాల్గొంటాయి.

జపాన్ (కెమెరా సిస్టమ్) - $85

తైవాన్ (చిప్ తయారీ) - $150

దక్షిణ కొరియా (OLED స్క్రీన్, మెమరీ చిప్స్) - $90

జర్మనీ, వియత్నాం, మలేషియా (చిన్న భాగాలు) - $45

చైనా, భారత్‌ (అసెంబ్లీ పని) - $30

అమెరికన్ కంపెనీలు (క్వాల్‌కామ్, బ్రాడ్‌కామ్) - $80

GTRI నివేదిక ప్రకారం.. ఐఫోన్‌లు భారత్‌, చైనాలో అసెంబుల్ చేయబడతాయి. కాబట్టి ఈ దేశాలు Apple నుండి ఒక్కో పరికరానికి $30 మాత్రమే పొందుతాయి. ఇది iPhone మొత్తం రిటైల్ ధరలో 3 శాతం కంటే తక్కువ.

GTRI నివేదిక ప్రకారం.. 25% సుంకం అమలులోకి వచ్చిన తర్వాత కూడా.. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ US కంటే మరింత సరసమైనదిగా ల‌భిస్తుంది. అమెరికా, భారత్‌లో ఐఫోన్‌ తయారీకి వేతనాల్లో వ్యత్యాసం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. భారత్‌లో ఐఫోన్ తయారీకి సంబంధించిన అసెంబుల్ వర్కర్‌కు నెలకు $ 230 (దాదాపు రూ. 20 వేలు) వేతనం లభిస్తుంది. అయితే.. అమెరికాలో వేతనాలు ఎక్కువ. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఐఫోన్ అసెంబుల్ కార్మికులకు నెలకు $ 2,900 (సుమారు రూ. 2.46 లక్షలు) వరకు వేతనం చెల్లించాలి.

దిగుమతులను మరింత తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఉంది. PLI పథకం కింద Apple ఆర్థిక సహాయం పొందుతుంది. దాని ఖర్చులు కూడా తగ్గుతాయి. అదే సమయంలో ఆపిల్ ఐఫోన్ తయారీని అమెరికాకు మార్చినట్లయితే.. ఐఫోన్‌పై కంపెనీ లాభం $ 450 (సుమారు రూ. 38,250) నుండి $ 60 (5,100)కి తగ్గుతుంది. లాభం కావాలంటే యాపిల్ ఐఫోన్ రిటైల్ ధరలను పెంచాల్సి రావచ్చు. రేట్లు పెంచకపోతే అమెరికాలో ఐఫోన్‌ల తయారీ కంపెనీకి భారం అవుతుంది.

Next Story