చెక్కుచెదరని ఆ రికార్డ్‌కు నేటితో 16ఏళ్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 April 2020 2:32 AM GMTక్రికెట్.. విశేష ఆదరణ ఉన్న ఆట. ఈ ఆటలో చాలామంది దిగ్గజాలున్నారు. ఎంతోమంది ఎన్నో ఎన్నో రికార్డులను తమ పేర లిఖించుకున్నారు. కొంతమంది రికార్డులు మరికొందరు బ్రేక్ చేయగా.. అతి తక్కువ రికార్డులు మాత్రమే పదిలంగా ఉన్నాయి. అలా 16 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు ఒకటి ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఒక ఇనింగ్సులో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డ్.
అప్పుఎప్పుడో.. ఆస్ట్రేలియా క్రికెటర్ హెడెన్(380), శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే(374) ప్రయత్నించినా అందుకోలేకపోయారు. ఇక ఇప్పటివరకూ ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా ఎవరూ కూడా చేరలేదు. ఆధునిక క్రికెట్ గాడ్‌లలో ఒకరిగా(సచిన్ తో పాటు) పేరొందిన లారా(400) ఈ అరుదైన రికార్డు సాధించారు. చరిత్రపుటల్లో పదిలంగా నిక్షిప్తమై ఉన్న ఆ రికార్డుకు నేటితో 16 ఏళ్లు. ఒక్కసారి ఆ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.
కరీబియన్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. క్రికెట్ తెలసిన అందరికి లారా తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇక లారా పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది అతడు ఇంగ్లండ్‌పై చేసిన క్వాడ్రపుల్ శతకమే(400). 2004లో విండీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో.. ఆఖరి మ్యాచ్‌లో లారా ఈ ఘనత సాధించాడు.
అయితే.. ఈ సిరీస్ మొదలయ్యే నాటికి లారా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. తొలి మూడు టెస్టుల్లోనూ లారా 100 పరుగులే చేశాడు. ఇక లారా పనైపోయిందని.. తీవ్రంగా విమర్శలు చుట్టుముట్టాయి. అటువంటి విపత్కర పరిస్థితులలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఇక లారా ఇనింగ్సులో 582 బంతులు ఎదుర్కొని.. 43 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 400 పరుగులు చేశాడు. అలాగే టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 350పైగా వ్యక్తిగత పరుగులు లారా రెండుసార్లు సాధించాడు.