ఈ ఏడాది ఐపీఎల్‌ను మ‌ర్చిపోవాల్సిందే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2020 11:51 AM GMT
ఈ ఏడాది ఐపీఎల్‌ను మ‌ర్చిపోవాల్సిందే..

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) దెబ్బ‌కి క్రీడారంగం కుదేలైంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి చాలా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మార్చి 28న ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) క‌రోనా ముప్పుతో ఏప్రిల్ 15 వర‌కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

మ‌న దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నెల 14తో లాక్‌డౌన్ ముగుస్తుండ‌గా.. లాక్‌డౌన్ ను పొడిగించాల‌ని ప‌లు రాష్ట్రాల సీఎంలు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధాని ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గానే.. పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

తాజాగా ఐపీఎల్ నిర్వ‌హాణ‌పై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలి స్పందించారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నామ‌నీ, ఇప్పుడే ఏమీ చెప్ప‌లేమ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఐపీఎల్ ను నిర్వ‌హించ‌డం క‌ష్ట‌మ‌ని.. దాదాపు ఈ ఏడాది ఐపీఎల్ మ‌రిచిపోవాల్సిందేన‌న్నాడు.

"ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిమాణాల‌న్నింటిని ప‌ర్య‌వేక్షిస్తున్నాం. ప్ర‌స్తుత స‌మ‌యంలో ఏం చెప్ప‌లేము. విమానాశ్ర‌యాలు మూత‌బ‌డ్డాయి. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కార్యాల‌యాలు అన్ని లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఎవ‌రు ఎక్క‌డికి వెళ్ల‌లేని ప‌రిస్థితి ఉంది. ఈ ప‌రిస్థితి మే నెల మ‌ధ్య వ‌ర‌కు ఇలాగే ఉండేలా ఉంద‌నిపిస్తోంది. ఆట‌గాళ్ల‌ను ఎలా తీసుకువ‌స్తారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఎలాంటి క్రీడ‌ల‌కు అనుకూలంగా లేదు. ఐపీఎల్‌ను ఈ ఏడాది మ‌రిచిపోవాల్సి ఉండొచ్చున‌ని "అన్నారు. ఓ సారి బీసీసీఐ అధికారుల‌తో చ‌ర్చించి సోమ‌వారం ఐపీఎల్ పై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అన్నారు.

Next Story
Share it