అందుకే నాకు బోర్ కొట్టట్లేదు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 April 2020 8:30 AM ISTకరోనా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న టాఫిక్. లక్షల మంది జీవితాల్లోకి ఎంటరై.. లక్షమందిని బలి తీసుకున్న మహమ్మారి. దీని కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండగా.. అదే బాటను భారత్ కూడా ఎంచుకుంది. ఇక దీని కారణంగా పనీ పాట లేక ఎక్కడి జనం అక్కడే ఇళ్లల్లో ఇరుక్కుపోయారు.
బయటికెళ్తే మహమ్మారి కాటేస్తుందేమోనని ఇంటిపట్టునే ఉంటున్నారు. అయినా కరోనా కట్టడి అవట్లేదు. రోజురోజుకు కేసులు పెరుగుతునే వున్నాయి. దీంతో బయటికెళ్లి దాని బారిన పడే కన్నా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో గడపడం నయమనుకుంటున్నారు జనం. అయితే టాలీవుడ్ హస్యరథం బ్రహ్మానందంకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో లాక్‌డౌన్ వల్ల బోర్ కొడుతుందా..? అనే ప్రశ్న ఎదురైంది.
దీంతో ఆయన స్పందిస్తూ.. నాకు లాక్‌డౌన్.. షూటింగ్ ఒకేలా ఉన్నాయి. మాములు రోజుల్లో నేను.. షూటింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటాను. దీనికి మించి నాకు పెద్దగా వేరే వ్యాపకాలు లేవు. అందుకే నాకు లాక్‌డౌన్ కారణంగా బోర్ అనే ఫీలింగ్ రావట్లేదు అని బ్రహ్మానందం అన్నారు. ఇక బ్రహ్మానందం ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న 'రంగమార్తాండ'లో కీలకపాత్ర పోషిస్తున్నారు.