9 ఏళ్లుగా అన్నం తినని బాలుడు.. అసలు కారణమేంటి.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2020 1:51 PM ISTఅన్నం తినకుండా ఎవరైనా ఎన్నిరోజులు ఉండగలుగుతారు ? మహా అయితే ఒక్కరోజు లేదా.. రెండ్రోజులు. మూడో రోజు వచ్చేసరికి నీరసమొచ్చి మంచానికి అతుక్కుపోతారు. కానీ పైన మీరు చూస్తున్న ఫొటోలో ఉన్న పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఇంత వరకూ అన్నమే తినలేదట. మీరు చదివేది నిజమే. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన ఈ బాలుడికి ఇప్పుడు 10 సంవత్సరాలుంటాయి. గత తొమ్మిదేళ్లుగా అన్నమే తినట్లేదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒకవేళ బలవంతంగా పెట్టినా వెంటనే వాంతి చేసేసుకుంటాడట.
అసలు ఆ బాలుడు అన్నం ఎందుకు తినడు. అన్నం తినకుండా ఎలా బ్రతుకుతున్నాడు ? అన్న సందేహం వచ్చింది.. ఇది తెలుసుకుందామని ఓ మీడియా సంస్థ ఆ ఊరు వెళ్లి వారిని ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగానే అన్నం తినకుండా.. రోజంతా ఇడ్లీ, అట్టు, పూరీలు తింటూ ఉండేవాడట. కొంచెం ఊహ తెలిశాక ఇంటికి దగ్గరగా ఉన్న ఓ బడ్డీకొట్టులో కుర్ కురే, పాపడ్స్ వంటి ప్యాకెట్లు కొనుక్కుని అవి తింటూనే బతికేస్తున్నాడు ఈ చిన్నోడు. కానీ జీవితమంతా ఇలా అన్నం తినకుండా ఉంటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని చెప్తున్నారు వైద్యులు.