కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : బీజేపీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Sept 2020 4:24 PM ISTఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
విజయవాడలో నిర్వహించిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని తన వ్యాఖ్యలతో అవమాన పర్చారని మండిపడ్డారు.