జనసేన-బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ..!
By సుభాష్ Published on 6 Sep 2020 5:49 AM GMT2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తెలుగుదేశం-బీజేపీ కూటమితో కలిసి సాగి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడానికి ఇతోధికంగా సాయం చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే తర్వాతి ఐదేళ్లలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అధికార పక్షానికి పవన్ మిత్రుడా, శత్రువా తెలియని గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ కన్ఫ్యూజన్ అలాగే కొనసాగి ఎన్నికల్లో ఇటు టీడీపీకి, అటు జనసేనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆ దెబ్బతో టీడీపీకి పూర్తిగా దూరం అయిపోయాడు జనసేనాని. ఎన్నికలు అయిన కొన్ని నెలల తర్వాత జనసేన, బీజేపీ మధ్య స్నేహం చిగురించి ఇరు పార్టీలూ కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాయి. ఇటు అధికార అండా లేక.. అటు ఆర్థిక బలమూ లేక క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న జనసేనకు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తోడైతే దూకుడుగా వ్యవహరించేందుకు.. అధికార పార్టీని ఢీకొట్టేందుకు.. క్షేత్ర స్థాయిలో బలపడేందుకు అవకాశం ఉంటుందని అంతా అంచనా వేశారు.
కానీ కరోనా, ఇతర కారణాల వల్ల ఇప్పటిదాకా జనసేన-బీజేపీ కలిసి ఏపీలో గ్రౌండ్ లెవెల్లోకి దిగి ఏ కార్యక్రమాలూ చేపట్టలేకపోయాయి. దీంతో ఈ పార్టీల కలయిక వల్ల ఇరువురికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. 2024లో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటనలు చేస్తూ.. క్షేత్ర స్థాయిలో ఏమీ చేయకుంటే జనాలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఇరు పార్టీలకూ ఇప్పుడు బాగానే అర్థమైనట్లుంది. ఈ నేపథ్యంలో ఇక యాక్షన్ ప్లాన్ అమల్లోకి తేవాల్సిందే అని ఇరు పార్టీలూ నిర్ణయించుకున్నట్లున్నాయి. ఈ దిశగా జనసేన అగ్ర నేత నాదెండ్ల మనోహర్ సంకేతాలిచ్చారు. తాజాగా బెంగళూరు ఐటీ నిపుణులతో నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి జనసేన కార్యక్షేత్రంలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏపీలో సమస్యలపై జనసేన, బీజేపీ కలిసి రాజీ లేని పోరాటం చేస్తాయని.. క్షేత్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రచించామని ఆయన తెలిపారు. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల మెతకగా.. జనసేన పట్ల చాలా దూకుడుగా వ్యవహరించే అధికార పార్టీ.. ఈ రెండు పార్టీలూ కలిసొస్తే ఎలా ఎదుర్కొంటున్నది ఆసక్తికరం.