ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

By సుభాష్  Published on  6 Sep 2020 5:31 AM GMT
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

ఈజ్ ఆఫ్ డూయింగ్ తెలుగు రాష్ట్రాలు సత్తాను చాటాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ – 2019 ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. శనివారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. తొలి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఏపీ, ఉత్తర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్‌ అభినందనలు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీలో ఈ రాష్ట్రాలే ముందున్నాయని ఆమె అభినందించారు.

దేశీయ, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి, వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, రాష్ట్రాల మధ్య పోటీ నెలకొల్పేందుకు ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లు ప్రకటిస్తోంది. 2019 ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలోనూ..తెలంగాణ మూడో స్థానంలోనూ నిలిచాయి. ఈ ర్యాంకింగ్ లను కార్మిక చట్టాలు, భూమి లభ్యత, నిర్మాణ అనుమతులు, పర్యావరణ పరిస్థితి, సమాచార లభ్యత, సింగిల్ విండో వ్యవస్థ వంటి ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. వాణిజ్య సంస్కరణల్ని ఏ రాష్ట్రం ఎలా అమలు చేస్తుందనేదానిపై కూడా ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది.

గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. నాలుగు, ఐదు ఆరు స్థానాల్లో వరుసగా మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. గత ఏడాది ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 12 స్థానంలో ఉండగా.. ఈ ఏడాది రెండో స్థానానికి చేరుకుంది.వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుకు కారణం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఓ వర్గం అంటూ ఉంటే.. కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అంటూ సామాజిక మాధ్యమాల్లో అప్పుడే చర్చకు తెరతీశారు.

Next Story
Share it