కేసీఆర్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్
By సుభాష్ Published on 12 Dec 2019 3:22 PM GMTతెలంగాణలో మద్య నిషేధం జరగాలని ఈ రోజు బీజేపీ నాయకురాలు డికే. అరుణ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోమద్యం ఏరులైపారుతోందని, కేసీఆర్ సర్కార్ వెంటనే మద్య నిషేధం దిశగా చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు కోరారు. దిశ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. డికే అరుణ చేపట్టిన దీక్షకు పలువురు మద్దతు పలికారు. అలాగే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మద్దతూ తెలిపి మాట్లాడారు. మద్యం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, కేసీఆర్ వెంటనే మద్యాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. దిశ ఘటనకు మద్యమే కారణమని అన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానన్న సీఎం కేసీఆర్.. మద్యం రాష్ట్రంగా మార్చారని రాజాసింగ్ ధ్వజమెత్తారు. మద్యం వల్లే దిశ హత్య జరిగిందని.. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని మండిపడ్డారు. దిశ లాంటి ఘటనలను ఇక నుంచి రాష్ట్రంలో జరగనివ్వమని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు చూసి కేసీఆర్ కళ్లు తెరవాలని అన్నారు.