అయోధ్యకు బయలుదేరిన రామ్ దేవ్ బాబా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Aug 2020 1:27 PM GMTఅయోధ్య రామాలయం శంకుస్థాపనకు పలువురు ప్రముఖులు బయలుదేరుతున్నారు. పతంజలి యోగపీఠ్ స్థాపకుడు రామ్ దేవ్ బాబా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. హరిద్వార్ నుండి అయోధ్యకు రామ్ దేవ్ బాబా ఛాపర్ లో బయలుదేరి వెళ్లారు. అయోధ్య రామాలయం భూమి పూజను చూడబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని రామ్ దేవ్ బాబా అన్నారు. హిందూ బంధువులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అయోధ్య రామాలయం ఈరోజు సాకారమవుతోందంటే అందుకు కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అని రామ్ దేవ్ బాబా చెప్పుకొచ్చారు.
ఈ భూమి పూజను కళ్లారా చూడబోతున్నందుకు ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నానని రామ్ దేవ్ బాబా తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో అందుకు సంబంధించిన వీడియోను కూడా రామ్ దేవ్ బాబా పోస్టు చేశారు. మథుర లో శ్రీకృష్ణుడి ఆలయం, వారణాసి లో విశ్వనాథ్ ఆలయంకు సంబంధించిన సమస్యలను కూడా తీర్చాలని కోరారు. రామ్ దేవ్ బాబాతో కలిసి రిషికేష్ కు చెందిన పర్మార్త్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద్ తదితరులు అయోధ్యకు బయలుదేరారు. ఆగష్టు 5న రామ జన్మభూమికి చెందిన భూమి పూజ మహోత్సవం జరగనుంది.
ముహూర్త నిర్ణేతకు బెదిరింపులు
అయోధ్య రామాలయ భూమి పూజకు కర్ణాటక రాష్టం బెళగావికి చెందిన ప్రముఖ సిద్ధాంతి ఎన్.ఆర్.విజయేంద్రశర్మ ముహూర్తాన్ని నిర్ణయించారు. తాను నిర్ణయించిన భూమిపూజ ముహూర్తం సరైంది కాదంటూ, వేరొకటి ప్రకటించాలని ఆగంతుకులు ఫోన్ చేశారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. విజయేంద్రశర్మ రెండు ముహూర్తాలను సూచించగా రామజన్మభూమి ట్రస్ట్ ఈ ముహుర్తాన్ని ఎంచుకుంది. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇంటివద్ద భద్రతను ఏర్పాటు చేశారు.