సిద్ధిపేటకు చెందిన మకరంద్ కు సివిల్స్ లో 110వ ర్యాంక్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 1:14 PM GMT
సిద్ధిపేటకు చెందిన మకరంద్ కు సివిల్స్ లో 110వ ర్యాంక్‌..!

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) విడుద‌ల చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటకు చెందిన యువకుడు సత్తా చాటాడు. మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మకరంద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా రావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామం. మకరంద్ తల్లిదండ్రులు నిర్మల, సురేశ్ నాలుగు దశాబ్దాల కిందట సిద్ధిపేటలో స్థిరపడ్డారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తమ కుర్రాడు సాధించిన ఘనత పట్ల తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

సివిల్స్ ఫలితాల్లో ప్ర‌దీప్‌సింగ్ అనే అభ్యర్థి మొద‌టి ర్యాంక్ ద‌క్కించుకోగా.. జ‌తిన్ కిషోర్ 2వ‌, ప్ర‌తిభా వ‌ర్మ 3వ ర్యాంకు సాధించారు. ‌ప్రతిభ వర్మ ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమ్మాయి.

హ‌ర్యానాలోని సోనిపాట్ జిల్లాకు చెందిన ప్ర‌దీప్ సింగ్ మొదటి ర్యాంకును సాధించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌దీప్ నాలుగు సార్లు సివిల్స్ ప‌రీక్ష‌లు రాశాడు. గ‌త ఏడాది అత‌నికి 260వ ర్యాంక్ వ‌చ్చింది. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్‌లో ఇండియ‌న్ రెవ‌న్యూ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా శిక్ష‌ణ పొందుతున్నాడు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో ప్ర‌దీప్ తండ్రి సుఖ్‌బీర్ సింగ్ స‌ర్పంచ్‌గా చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌ని తండ్రి ప్రోత్స‌హించార‌ని, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తాన‌ని ప్ర‌దీప్ తెలిపారు.

2019 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా 2020 ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ఇంట‌ర్వ్యూలో నెగ్గి మొత్తం 829 మంది స‌ర్వీసుల‌కు ఎంపికైన‌ట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ ఏడాది సివిల్ స‌ర్వీసుల‌కు ఎంపికైన వారిలో 304 మంది జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు కాగా.. 78 మంది ఈడ‌బ్ల్యూఎస్‌, 251 మంది ఓబీసీ, 129 మంది ఎస్సీ, 67 మంది ఎస్టీ క్యాట‌గిరీల‌కు చెందినవారు వున్నారు. ‌

బెల్లంపల్లికి చెందిన సిరిశెట్టి సంకీర్త్ మంచి ర్యాంక్ ను సాధించాడు. సివిల్స్ ఫలితాల్లో ఆలిండియాలో 330 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథలో ఏఈగా పనిచేస్తున్న సంకీర్త్ తండ్రి సింగరేణిలో ఎలక్ట్రీషియన్ కాగా, తల్లి ప్రైవేట్ పాఠశాల నడుపుతున్నారు.

Next Story