కొత్త సచివాలయంలో సీఎం ఛాంబర్ ఎక్కడో డిసైడ్ చేశారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 6:45 AM GMT
కొత్త సచివాలయంలో సీఎం ఛాంబర్ ఎక్కడో డిసైడ్ చేశారా?

కారణం ఏదైతే కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభిలాషకు తగ్గట్లే.. కూల్చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇప్పటికే 90 శాతం నేలమట్టమైన ఈ భారీ భవన సముదాయాలు మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా కూల్చేస్తారని చెప్పక తప్పదు. ఇప్పటికే కొత్త సచివాలయానికి సంబంధించిన డిజైన్లపై ఒక క్లారిటీకి రావటమే కాదు.. ఇటీవల కాలంలో ఫైనల్ చేసిన డిజైన్ కు వాయిదాల పద్దతిలో మార్పులు.. చేర్పులు చెబుతున్నారు సీఎం కేసీఆర్. తాజాగా కొత్త సచివాలయంలో కీలకమైన సీఎంవో ఎక్కడో.. ముఖ్యమంత్రి ఛాంబర్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ బుధవారం (రేపు) తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సచివాలయానికి సంబంధించిన నమూనాకు అధికారికంగా ముద్ర వేయనున్నరు. ఈ నేపథ్యంలో డిజైన్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. పాత సచివాలయానికి సంబంధించి జే.. ఎల్ బ్లాకులు మినహాయిస్తే మిగిలిన అన్ని బ్లాకుల్ని కూల్చివేత పూర్తి అయ్యింది. మిగిలిన రెండు పెద్ద భవనాలు కావటంతో కూల్చివేత పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు చెబుతున్నారు.

ఈ రెండు భవనాలకు సంబంధించి ఇంకా 20 నుంచి 30 శాతం కూల్చివేత బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. కొత్త సచివాలయాన్ని మొత్తం ఏడు అంతస్తుల్లో నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఏడో అంతస్తులో ఏర్పాటు చేయవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. అంతా బాగుంది కానీ.. కేసీఆర్ ఎంతగానో ‘ఆరు’ అంకెకు బదులుగా ఈసారి ‘ఏడు’ను ఎందుకు లెక్కలోకి తీసుకున్నట్లు చెప్మా?

Next Story