ఆసక్తికరంగా మారిన కేటీఆర్ నోట మాట‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 7:13 AM GMT
ఆసక్తికరంగా మారిన కేటీఆర్ నోట మాట‌..!

అమూల్యమైన మాటను అలవోకగా చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తాజాగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల తాను మాట ఇచ్చినట్లుగా కొత్త అంబులెన్సుల్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రభుత్వం ఆసుపత్రిలోని కొవిడ్ వార్డు.. సర్దాపూర్ లోని వ్యవసాయ కళాశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి నర్సింగ్ సిబ్బందితో కలిసి సెల్ఫీలు దిగి.. వారిని ఉత్సాహపర్చారు.

ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాట ఒకటి మాత్రం ఆసక్తికరంగా మారింది. అన్ని హంగులు ఉన్న అగ్రదేశాలకు సైతం కరోనా సమస్యగా మారిందని.. దాని నివారణ ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ల పనిగా భావించొద్దంటూ అదరగొట్టేసే మాట చెప్పేశారు. ప్రాణాంతకమైన వైరస్ మీద పడుతున్న వేళ.. ప్రజల్ని కాపాడాల్సిన అవసరముంది. అందుకు సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రి పనిగా కాదన్న అమూల్యమైన మాట రావటం గమనార్హం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు.. వైద్య సిబ్బంది.. పోలీసులు.. పారిశుధ్య సిబ్బందికి ప్రజలు నైతికంగా నిలవాల్సిన అవసరం ఉందని.. వారి స్థైర్యం దెబ్బ తినేలా విమర్శలు చేయొద్దన్నారు. చిల్లరమల్లర మాటలు వద్దని.. ఆరోపణలకు ఇది సందర్భం కాదనే కేటీఆర్.. మరి తమ రాజకీయ ప్రత్యర్థులపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు అన్నది ప్రశ్న. పాజిటివ్ స్టోరీలు రావాలయని.. నెగిటివ్ స్టోరీలు వద్దన్నారు. ఇటీవల కాలంలో పాత్రికేయం ఎలా ఉండాలన్న దానిపై సలహాలు.. సూచనలు ఇవ్వటం ఎక్కువైంది. ఓవైపు పాలకుల బాధ్యతను.. వారి పని ఖాతాలో నుంచి తీసేసే ప్రయత్నం చేసిన మంత్రి కేటీఆర్.. అదే సమయంలో పాత్రికేయులు ఎలా పని చేయాలో చెప్పటం చూస్తే.. కేటీఆర్ ఏం కోరుకుంటారో అర్థమైనట్లుంది?

Next Story