ఆన్‌లైన్‌.. నాట్‌ ఫైన్‌..?

By మధుసూదనరావు రామదుర్గం  Published on  4 Aug 2020 12:49 PM GMT
ఆన్‌లైన్‌.. నాట్‌ ఫైన్‌..?

పూర్వంలో వానాకాలం చదువులు అనేవారు. వానవస్తే బడుల్లో నీళ్ళు కారడంతో సెలవులు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చేది. ఎప్పుడు వానొస్తుందో తెలీదు. కానీ వచ్చిందంటే ఆరోజు బడికి సెలవే! ఇప్పుడు కొత్తగా కరోనా చదువులు అనాల్సి వస్తోంది. కరోనా ధాటికి మూతపడిన స్కూళ్ళను ఎప్పుడు తెరవాలో తెలీక çసతమతమవుతూ ఇక చేసేదిలేక ప్రైవేటు యాజమాన్యం ఆన్‌లైన్‌ చదువులకు తెరతీసింది. ఈ ఏడు విద్యాసంవత్సరం దెబ్బతినరాదనే ఈ చర్యలు అని ప్రైవేటు స్కూళ్ళు అంటున్నా... అదేం కాదు బడులు తెరవకపోతే నిర్వహణ కష్టమని ఆన్‌లైన్‌ పేరిట తలిదండ్రుల వద్ద ఫీజులు పిండేస్తున్నారన్న విమర్శలు మరోవైపు చాలా ఘాటుగా వినిపిస్తున్నాయి.

ఆన్‌లైన్‌ బోధన విధానంపై ప్రభుత్వాల నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడం కూడా గందరగోళానికి కారణమవుతోంది. ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వారు ఈ ప్రక్రియ ను చేపడుతుంటంతో విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో పడిపోతున్నారు. అనసవర పోటీ భావనతో ప్రైవేటు బడులు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాఠాలు అంటూ పిల్లల్ని ఠారెత్తిస్తున్నాయి. విద్యార్థులు అన్నేసి గంటలు మొబైల్, ట్యాబ్, కంప్యూటర్ల ముందు కూర్చో డంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ కరోనా రాకముందు దాకా పిల్లలు స్కూలు చదువులకే అలవాటు పడ్డారు. చదువులతో పాటు స్నేహితులతో ఆటపాటలు, ఓ ప్రత్యేక వాతావరణం ఉండటంతో వారు వత్తిడికి గురయ్యేవారు కాదు. ప్రత్యక్ష క్లాస్‌రూమ్‌కు వర్చువల్‌ క్లాస్‌రూమ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఉన్నట్టుండి ఆన్‌లైన్‌ అనేసరికి పిల్లలు అడ్జస్ట్‌ కాలేకపోతున్నారు. వారికి టీచర్లు బోధించే పాఠాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసు కోవడం కూడా కష్టంగా మారుతోంది. తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు టీచర్లు పాఠాలు చెబుతున్నారు...విద్యార్థులు వింటున్నారు అంటే... విన్నది తలకెక్కుతోందా లేదా అన్న పాయింటు తల్లిదండ్రులు ఎంతవరకు ఆలోచిస్తున్నారన్నది సందేహమే!

అన్నింటికి మించి తరగతిలో పాఠాలు చెబుతున్నప్పుడు తప్పనిసరిగా బోర్డు వర్క్‌ ఉండేది. విషయం అర్థం అయిందా లేదా అని టీచర్లు మధ్య మధ్యలో ప్రశ్నలు వేసేవారు. ఇప్పుడు అదంతా లేకపోవడంతో బోధన ఏకపక్షంగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత స్లైడ్‌లు వేసి చూపిస్తున్నా చూసి అర్థం చేసుకుని ముఖ్యమైన అంశాలు రాసుకునే సామర్థ్యం ఎంతమంది పిల్లలకు ఉంటోంది అన్నది ప్రశ్నార్థకమే.

అసలే ఆన్‌లైన్‌ విధానంతో పిల్లలు సతమవుతుంటే ఇంటర్నెట్‌ బ్యాండ్‌ విడ్త్‌ సరిగా ఉండని సమస్యతోడవుతోంది. దీనివల్ల ప్రసారంలో పలు అంతరాయాలు ఎదుర వుతున్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాలను ఆర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాదు ఫ్రెండ్స్‌కు అర్థమైన పాఠం తనకెందుకు అర్థం కావడంలేదన్న ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. పోనీ ఇంట్లో పెద్దలను అడుగుదామా అనుకుంటే ‘ఈ మాత్రం తెలీదా నీకు’ అంటూ హేళన చేస్తారేమోనని భయపడుతున్నారు.

ఆన్‌లైన్‌లో పాఠాలు వినడానికి విద్యార్థులకు అవసరమైన గాడ్జెట్స్‌ అందించడంలో తలిదండ్రులు శ్రద్ధ చూపాల్సి ఉంది. పాత మొబైల్‌ ఇచ్చేసి ఇందులో చూసుకో అంటే కళ్ళు దెబ్బతింటాయి. ఈ ఇబ్బందుల వల్లే పిల్లలు ట్యాబ్‌ కొనాలని మంకుపట్టు పడుతుంటారు. కానీ తలిదండ్రులకు వెనువెంటనే కొనే ఆర్థికస్తోమత కూడా ఉండాలిగా! కరోనా పుణ్యమా అని ఉద్యోగాలు పోయిన వారు కొందరుంటే, ఉన్నా అంతంత కోత జీతాలతో ఇబ్బంది పడుతున్న వారు మరికొందరు. పులిమీద పుట్రలా ఫీజుల పేరిట స్కూళ్ళ వేధింపులు. ఇవి చాలవూ అన్నట్టు పిల్లలకు ట్యాబ్‌లు మరి తల్లిదండ్రులైనా విసుక్కోక ఏం చేస్తారు. ఇది అర్థం చేసుకోలేని పిల్లలేమో అలిగి కూర్చొంటున్నారు. ఏం ఆన్‌లైన్‌రా నాయనా మా చావుకు వచ్చిందంటూ పేరెంట్స్‌ అనుకుంటున్నారు. ఇదీ ఆన్‌లైన్‌ బోధన పరిస్థితి.

ఈ విషయంగా మానసికశాస్త్రవేత్తలు పలురకాలుగా స్పందిస్తూ సూచనలిస్తున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలను వీలుంటే రికార్డు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వినే వీలుంటుంది. కేవలం టీచర్ల పాఠాలే కాదు కాస్త ఓపికతో నెట్‌లో వెదికితో సంబంధిత అంశాలపై బోల్డెన్ని వీడియోలు సమాచారం దొరుకుతుంది. అన్నీ చూడటంతో లైన్‌ తప్పుతుందేమోననిపిస్తే ఏది పాఠానికి అవసరమో అది చూస్తే చాలు. ఇంట్లో పెద్దలు పిల్లలక సాయం చేయాలి. వారు కొన్ని సంబంధిత అంశాలు వెదికి పెడితే పిల్లలకు కాస్త సౌకర్యంగా ఉంటుంది. కంటికి ఎక్కువగా శ్రమ కల్గించకుండా అప్పుడప్పుడు కాస్త కళ్లుమూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అలాగే రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొనకుండా నిద్రపోవాలి. రిలాక్స్‌ కోసం మళ్ళీ వీడియోలే చూడకుండా ఇంట్లో వారితోనో, ఫోన్లలో స్నేహితులతోనో మాట్లాడుతుండాలి. శ్రమను తగ్గించడానికి ఈ పద్ధతులు అనుసరించడం మేలని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయినా ఈ ఆన్‌లైన్‌ బోధన ఎల్లకాలం ఉండదన్న విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఈ కరోనా తగ్గగానే మళ్ళీ బడులు తెరచుకుంటాయి. మళ్ళీ పాతరోజులు వస్తాయి. హాయిగా స్కూలుకు వెళ్ళవచ్చు, ఆడుకోవచ్చని తరచూ పెద్దలు పిల్లల్ని ఉత్సాహ పరుస్తుండాలి. ఎలాగూ ఇది సత్యం కాబట్టి అంతా ఉట్టిదే అని పిల్లలు కూడా అనరు. కానీ ఈ విపత్కర పరిస్థితిలో అలవాటు చేసుకున్న ఈ ఆన్‌లైన్‌ పద్దతి మున్ముందు పిల్లలకు బాగా కలిసివస్తుంది.

Next Story