రానున్న 20 రోజుల్లో కరోనాతో అమెరికాలో మరణాలెన్నో చెప్పిన సర్వే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 8:30 AM GMT
రానున్న 20 రోజుల్లో కరోనాతో అమెరికాలో మరణాలెన్నో చెప్పిన సర్వే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. అగ్రరాజ్యమైన అమెరికాను వదల్లేదు. ఆ మాటకు వస్తే.. కరోనా కారణంగా ప్రపంచంలో తీవ్ర ప్రభావానికి గురైన దేశాల్లో పెద్దన్న ముందువరుసలో ఉంటుంది. ఇప్పటివరకు ఆ దేశంలో 48 లక్షల మంది కరోనా బారిన పడితే.. ఆ మహమ్మారి కారణంగా 1.58లక్షల మంది మరణించారు. ఇదిలా ఉంటే.. రానున్న ఇరవై రోజుల్లో అమెరికాలో మరిన్ని కేసులు.. మరణాలు ఖాయమని చెబుతున్నారు.

అమెరికన్లను కలవరపాటుకు గురి చేస్తున్న ఈ హెచ్చరికను చూసింది అల్లాటప్పాది కాదు. అమెరికాలో ప్రముఖ ఆరోగ్యం సంస్థ ‘‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’’ అంచనా ప్రకారం.. రానున్న ఇరవై రోజుల్లో 19వేలకు పైగా అమెరికన్లు కరోనా కారణంగా మరణించే అవకాశం ఉందంటున్నారు. అంటే.. దగ్గర దగ్గర రోజుకు వెయ్యి మంది మరణించే వీలుందన్న అంచనాను వెల్లడించింది.

అమెరికాలో ప్రస్తుతం వైరస్ మహమ్మారి కొత్తదశకు చేరుకుందని చెబుతున్నారు. మార్చి.. ఏప్రిల్ తో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. సంక్రమణం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అన్నింటి కంటే మరో ప్రమాదకరమైన సంకేతం.. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా వ్యాపిస్తోంది. అమెరికాలో మరో ఇబ్బందికర పరిణామం ఏమిటంటే.. కేసులు పెరుగుతున్న వేళ.. అందుకు తగ్గట్లు భారీగా పరీక్షలు పెరగాల్సి ఉంది. షాకింగ్ వాస్తవం ఏమంటే.. కేసులు పెరుగుతున్నకొద్దీ అమెరికాలో పరీక్షల సంఖ్య తక్కువగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే.. రానున్న రోజులు అమెరికాకు మరింత పీడకలగా మారనున్నాయని చెప్పక తప్పదు.

Next Story