పాక్ టీవీ ఛానల్ లో భారత్ త్రివర్ణ పతాకం.. ఇప్పుడు ఆ ఛానల్ పరిస్థితేమిటంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 12:40 PM GMT
పాక్ టీవీ ఛానల్ లో భారత్ త్రివర్ణ పతాకం.. ఇప్పుడు ఆ ఛానల్ పరిస్థితేమిటంటే..!

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ లో భారత త్రివర్ణ పతాకం వచ్చి.. ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? టీవీ చూస్తున్న వాళ్లే కాదు.. సదరు టీవీ యాజమాన్యానికి కూడా తలనొప్పులు తప్పవు. తాజాగా పాకిస్థాన్ టీవీ ఛానల్ 'డాన్ న్యూస్' కు అలాంటి పరిస్థితే ఎదురైంది. డాన్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అన్న శుభాకాంక్షలు కూడా కనిపించాయి. ఇది చూసిన పాక్ ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆగష్టు రెండో తేదీ పాకిస్థాన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓ ప్రోగ్రాం మధ్యలో ఇలా ప్రసారమైంది. కమర్షియల్స్ వస్తున్న సమయంలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

డాన్ చానల్ యాజమాన్యం కూడా ఈ ఘటనపై షాక్ కు తింది. అలా ఎలా వచ్చింది అని ఛానల్ సభ్యులు జుట్టు పీక్కుంటున్న సమయంలో ఛానల్‌ హ్యాక్ అయిందని తెలిపింది. దీని వెనుక వున్నది ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. తమ వ్యూవర్లకు కూడా నిజాన్ని తెలియజేస్తామని తెలిపింది.

దీనిపై పాకిస్థానీ నెటిజన్లు కూడా స్పందించారు. డాన్ న్యూస్ ఛానల్ ను పెద్ద ఎత్తున తప్పుబట్టారు. డాన్ న్యూస్ సంస్థ చాలా సార్లు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా వ్యవహరించిందని ట్వీట్లు చేశారు. డాన్ న్యూస్ ను పాకిస్థాన్ నుండి వెళ్లిపోవాలని కోరుతూ ట్వీట్లు చేశారు. 'పాకిస్థాన్ ను ప్రేమించండి లేదంటే పాకిస్థాన్ నుండి వెళ్లిపోండి' అంటూ డిమాండ్ చేశారు. డాన్ న్యూస్ సంస్థకు ఏదో వేరే అజెండా ఉందని పలువురు కామెంట్లు చేశారు.

Next Story