మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదు.. లంచం : అయ్యన్న పాత్రుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2020 1:05 PM IST
మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదు.. లంచం : అయ్యన్న పాత్రుడు

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాంకి సంబంధం ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మాట్లాడారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్‌.. మంత్రి జయరాం కుమారుడికి బెంజ్‌ కారును బహుమతిగా ఇచ్చాడని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యనించారు. మంత్రి జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని.. అందుకే మంత్రి కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టిన రోజు కానుక కాదు.. లంచం అని ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపిస్తామని ఆయన అన్నారు. ఈశ్వర్‌కు బెంజికారు ఇస్తున్న ఫోటోను మీడియాకు విడుదల చేశారు.

మీడియా సమావేశంలోనే ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేసిన అయ్యన్న.. మంత్రి జయారాం కొడుకు ఈశ్వర్‌కు ఈఎస్‌ఐ స్కాంలో ఏ14 నిందితుడు కార్తీక్‌ కారును ఇచ్చాడని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆధారాలను కూడా పంపుతాయన్నారు. 2019 డిసెంబర్‌లో బెంజ్‌కారును మంత్రి కొడుకుకు అందించారని ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. జయరాంను మంత్రి మండలి నుంచి తప్పించాలని ఈ సందర్భంగా అయ్యన్న డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికొస్తే సమాధి అవుతారని హెచ్చరించారు.

Next Story