ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఊరుకోం : మంత్రి అవంతి శ్రీనివాస్
By Medi Samrat Published on 26 July 2020 3:19 PM ISTవిశాఖపట్నం : మంత్రి అవంతి శ్రీనివాస్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మీరు సీఎం జగన్ భిక్షతో లోక్‌సభలో అడుగుపెట్టారనే విషయం గుర్తుంచుకోవాలని.. జగన్ చరిష్మాతో మాత్రమే మీరు నాగబాబుపై గెలుపొందారని.. మీకు భిక్ష పెట్టిన సీఎంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. వైసీపీ జెండాపై గెలిచిన మీరు.. టీడీపీ నాయకుల కంటే ఎక్కువ విమర్శలు చేస్తున్నారని.. మీరు నర్సాపురం వరకు పరిమితం కండి.. అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు.
విశాఖపట్నం రాజధానిగా వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణంరాజు ఎవరు..? ఇలా వద్దని మాట్లాడినందుకే చంద్రబాబు నాయుడుని వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండని అన్నారు. ఢిల్లీలో నాలుగు పార్టీల నాయకులు మీకు తెలుసుండొచ్చు. అలా అని అదేపనిగా పార్టీని విమర్శించడం తగదని సూచించారు. మీ పంథా మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని. పార్టీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయండని సవాల్ విసిరారు.
రఘురామకృష్ణంరాజుకి నోటి దురుసుతనం ఎక్కువని.. ఆ దురుసుతనంతోనే అనుకున లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని అన్నారు. నలందా కిషోర్ అనారోగ్యంతో మృతి చెందారని.. ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కిషోర్ టీడీపీ అభిమాని.. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాం.
కరోనా ఎవరికైనా వస్తుందని.. పార్టీలతో సంబంధం లేదని అన్నారు. నలందా కిషోర్‌ను పోలీసులు కర్నూలు తీసుకువెళ్లడంతో మరణించారని చంద్రబాబు, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నలందా కిషోర్‌పై అభిమానం ఉంటే అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్.. ఇప్పుడు కిషోర్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు.. మీకు నలందా కిషోర్ ఎవరో తెలుసా ? నలందా కిషోర్.. మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబుతో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్ళారు. అలా చంద్రబాబు దగ్గరకు వెళ్లిన అయిదుగురిలో ముగ్గురికి కరోనా వచ్చింది. ఆ కరోనాతోనే నలందా కిషోర్ మృతి చెందారు. అలా ఆయన మృతికి చంద్రబాబు నాయుడే కారణమంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.