800 గొర్రెలతో చైనాకు బుద్ధి చెప్పిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2020 6:23 AM GMTచైనా వక్ర బుద్ధి ప్రపంచానికి తెలియంది కాదు. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలకు దిగుతుంటుంది. గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత ఇండో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు అలాగే కొనసాగుతున్నాయి. సైనిక ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఇరు వర్గాలు వెనక్కి తగ్గినప్పటికీ బోర్డర్‌లో గరం గరంలానే ఉంది. చైనా భారీ సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇక చైనాకు గట్టి బుద్ది చెప్పాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.
ఇలా భారత్‌లో చైనా కయ్యానికి కాలు దువ్వడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఓ సారి చైనా.. భారత్ పై ఆరోపణలు చేసింది. చైనా కుఠిల బుద్ధిని అర్థం చేసుకున్న అప్పటి ఓ యువ ఎంపీ చైనాకు చక్కటి గుణపాఠం నేర్పారు. ఆయన ఎవరో కాదు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ. 1962 భారత్-చైనా యుద్దం తరువాత రెండు దేశాల మధ్య సఖ్యత దెబ్బతింది. భారత్‌ను ఎలాగైనా రెచ్చగొట్టాలని చైనా చూస్తోంది. ఈ క్రమంలో 1965లో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది. దీనిలో భాగంగా సిక్కం సరిహద్దు దాటి తమ దేశానికి చెందిన వ్యక్తుల నుంచి 800 గొర్రెలు, 59 జడల బర్రెలను భారత సైన్యం దొంగిలించిందని ఆరోపించింది. ఆ సాకుతో యుద్ధానికి దిగి భారత్ రక్షణలో ఉన్న సిక్కిం భూభాగాన్ని ఆక్రమించాలని చైనా పన్నాగం.
దీనిపై ఇరు దేశాల మధ్య కొన్నాళ్ల పాటు లేఖల యుద్ధం సాగింది. తమ గొర్రెలను అప్పగించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని చైనా హెచ్చరిస్తూ ఓ లేఖ రాసింది. ఖండిస్తూ భారత్ కూడా ఉత్తరం రాసింది. చైనా ఆరోపణల వెనుక ఉన్న కుటిల నీతిని పసిగట్టిన అప్పటి జన్‌సంఘ్ ఎంపీ వాజ్‌పేయి ఆ దేశానికి గట్టిగా బుద్ది చెప్పాలని బావించారు. 800 వందల గొర్రెల తీసుకుని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంలోకి వెళ్లి నిరసన తెలిపారు. వాటి మెడలో ఫ్లకార్డులు తగిలించి ఉన్నాయి. వాటిపై ''మమ్మల్ని తినండి కానీ ప్రపంచాన్ని కాపాడండి'' అని రాసి ఉంది.
ఈ చర్యతో డ్రాగన్ దేశం విస్తుపోయింది. వెంటనే తమ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి ఘాటైన లేఖ రాసింది. ఇందులో భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించింది. దీనికి భారత ప్రభుత్వం కూడా ధీటైన జవాబు ఇచ్చింది. ఢిల్లీ వాసులు కొందరు 800 గొర్రెలను చైనా రాయబార కార్యాలయంలోకి తోలారని, ఇది ఊహించని పరిణామం అని, నిరసన కూడా శాంతియుతంగానే జరిగిందని, దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని జవాబు ఇచ్చింది. ఈ జవాబుతో చైనాకు ఏం చేయాలో తోచలేదు. దీంతో ఆ విషయాన్ని చైనా అంతటితో వదిలివేసింది. కాగా.. వాజ్‌పేయీ చేసిన ఈ చర్య దేశ వ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశమైంది.