కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పటి ఈ యాప్‌ను చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌లో కరోనా వైరస్‌ బాధితులు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారు. తదితర విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఈ యాప్‌ను ఈ-పాస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని ప్రధాని మోదీ సూత్రప్రాయంగా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ యాప్‌లో మరో రెండు ఫీచర్లను జోడించింది. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ పాస్‌ (ఈ-పాస్‌). లాక్‌డౌన్‌ వేళ బయట తిరిగేందుకు కోవిడ్‌ లక్షణాలు, ఉత్పత్తి స్థానం బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్‌, ఆరెంజ్‌ రంగులు ఉంటాయి.

ఆకు పచ్చరంగు వస్తే సదరు వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్చగా తిరగవచ్చు. ఆరెంజ్‌ రంగు వస్తే ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకూడదు. ఒక్క కార్యాలయం, ఇంటికి సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొనాల్సి ఉంటుంది. అంతేకాదు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇక రెడ్‌ రంగు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరిని కలవకూడదు. పూర్తిగా గృహ నిర్భంధంలోనే ఉండాలి. ఇప్పటికే చైనాలో ఈ పద్దతిని విజయవంతంగా అనుసరించగా, ఇప్పుడు భారత్‌లో కూడా దీన్ని ప్రయత్నించనున్నారు.

ఇక మరో కొత్త ఫీచర్‌ కోవిడ్‌ ఆప్‌డేట్స్‌.. ప్రపంచం, దేశంలో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల వివరాలు, ఏ ఆస్పత్రుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి.. ఒక వేళ కరోనా వస్తే ఎవరిని ఎలా సంప్రదించాలి అని తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌లు ఆపరేషనలైజ్‌ కాలేదు. మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.